కుప్పంలో చంద్రబాబు బిజీబిజీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, జగన్ రెడ్డి పాలన వైఫల్యాలపై ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసి, విధ్వంసకరమైన పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తిరుగుబాటు పెద్దఎత్తున వస్తోందని, ధర్మపోరాటానికి ప్రతిఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల పొత్తులపై వైసీపీ మాట్లాడుతున్న తీరు పనికి మాలినవని విమర్శించారు. దోపిడి రాజ్యం, దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని మండిపడ్డారు. కుప్పం ప్రజలకు తనకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందని, అలాంటి దాన్ని గుండా వైసీపీ వచ్చి చెడగొట్టిందని చెప్పుకొచ్చారు.
మళ్ళీ సీఎం నేనే..!
మళ్ళీ సీఎంగానే శాసన సభలో అడుగుపెడతానని కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షం పట్ల తమిళనాడులో స్టాలిన్ ఎంతో గౌరవంగా నడుచుకుంటున్నారని, ఏపీలో జగన్ రెడ్డి పాలనలో ఆ పరిస్ధతి లేదన్నారు. అందుకే తిరిగి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశానని వివరించారు. తెలుగుదేశం కార్యకర్తలకు నేను అండగా ఉంటా.. ఏ కార్యకర్తపై ఒక్క దెబ్బపడినా.. నాపై పడినట్లేనని భరోసా ఇచ్చారు. కేడర్ ను ఇబ్బందిపెడుతున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఓటీఎస్ ను ఎవ్వరూ చెల్లించకండి..తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే ఉచితంగా పేదలకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోందని చెప్పారు. రౌడీయిజం చెయ్యడం ఒక్క నిమిషం పని.. కానీ అది తన విధానం కాదని చెప్పుకొచ్చారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను తీవ్ర ఇబ్బందలకు గురిచేస్తున్నారన్నారు. వారిపేర్లును రాసిపెట్టుకున్నాని.. త్వరలో అందరి లెక్కలు తేల్చుతామని హెచ్చరించారు.











