ఏపీ సిఎం జగన్ పై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ ఓ ఐర్ లెగ్ అని.. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు. విశాఖ పర్యటనలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కోడికత్తి డ్రామాలు చేసి జగన్ అధికారంలోకి వచ్చారన్న చంద్రబాబు.. తాము అటువంటి డ్రామాలు చేయలేదని, తమకు ఆ అవసరం కూడా లేదన్నారు.జగన్ ఊరికొక సైకోను తయారు చేశారని.. ఇలాంటి పొలిటికల్ సైకోలను అణచివేసే బాధ్యత, శక్తి తమకుందని తెలిపారు.
పార్టీ కోసం పనిచేసే నాయకుల, కార్యకర్తల పనితీరు, సేవల ఆధారంగానే భవిష్యత్తులో వారికి అవకాశాలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. పార్టీ కోసం ఆర్థికంగా సాయపడేవాళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వారికి మెరుగైన అవకాశాలు ఉంటాయని అన్నారు.అదేసమయంలో కేసుల గురించి నేతలు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడొద్దని చంద్రబాబు అన్నారు. ఎంత ఎక్కువగా కేసులు ఉంటే పార్టీలో అంత భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో పోలీసులు పెడుతున్న అక్రమ కేసుల కోసం ఓ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, అన్నింటినీ పరిష్కరించే బాధ్యత తానే తీసుకుంటానని అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఇక పనిచేసేవాళ్లకు, ప్రజలతో నిత్యం మమేకయ్యే వారికే పదవులు ఉంటాయని బాబు స్పష్టం చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. టీడీపీలో ప్రజలకు అత్యధిక భాగస్వామ్యం కల్పించాలన్న ఆయన.. రాబోయే ఎన్నికల్లో పోరాడాలని, 30 ఏళ్లు అధికారంలో ఉండేలా టీడీపీ గెలుపు ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.