నాటకీయ పరిణామాల మధ్య దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తి అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో కో ఆప్షన్ మెంబర్, ఎంపీపీ, రెండు వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరిగాయి. ప్రశాంత వాతావరణంలో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ ఎన్నికలు పూర్తయ్యాయి. కాగా ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది.
దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులు రెండు ఉండగా, వాటిలో ఓ పదవిని టీడీపీ దక్కించుకోగా, ఇంకో పదవిని జనసేన చేజిక్కించుకుంది. టీడీపీ ప్రతిపాదించిన షేక్ జబీన్, జనసేన ప్రతిపాదించిన పసుపులేటి సాయి చైతన్యలు వైస్ ఎంపీపీలుగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
దుగ్గిరాల మండల పరిషత్‌కు సంబంధించి మొత్తం నాలుగు పదవులకు ఎన్నికలు జరగగా.. వాటిలో రెండింటిని టీడీపీ కైవసం చేసుకుంది.కాగా, అధికార వైసీపీ, జనసేన చెరో పదవిని దక్కించుకున్నాయి. ఇక ఎంపీపీ పదవిని వైసీపీ చేజిక్కించుకోగా.. జనసేన వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. దీంతో ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ మాత్రం వైస్ ఎంపీపీ పదవితో పాటు కో ఆప్షన్ మెంబర్ పదవిని కూడా దక్కించుకుంది.
ఇదిలా ఉంటే దుగ్గిరాల-2 ఎంపీటీసీ పద్మావతి ఆచూకీ ఇంకా తెలియలేదు.పద్మావతిని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తన వెంట తీసుకెళ్లాడని ఆమె కొడుకు యుగంధర్ ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ కుటుంబాన్ని వైసీపీ మానసికంగా వేధిస్తోందని.. ఎమ్మెల్యే ఆర్కే తీరుపై వైసీపీ ఎంపీటీసీ పద్మావతి కొడుకు మండిపడుతున్నారు.