(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. అధికార పార్టీ ఆకృత్యాలను అడ్డుకోవడంలో టీడీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖపై కన్నేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా కూడా ప్రకటించింది. ఇక్కడ బలంగా ఉన్న టీడీపీని దెబ్బ కొట్టేందుకు గత కొంత కాలంగా వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తూనే ఉంది. దానిని తిప్పికొట్టడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు దరిదాపుల్లోకి కూడా చేరలేకపోతున్నారు.
అయ్యన్న.. వెలగపూడి.. పల్లా .. మాత్రమే
అధికార పార్టీ విపరీత ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన తెలుగు తమ్ముళ్లు ఆది నుంచి వెనకడుగు వేయడంతో వైసీపీ నేతలు మరింతగా రెచ్చిపోతూ వచ్చారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించే ధైర్యమైనా చేస్తూ వచ్చారు. పక్క పార్టీ వైపు ఆది నుంచి చూస్తున్న గంటా శ్రీనివాసరావు వైసీపీను పల్లెత్తి మాటనే సాహసం కూడా చేయలేదు. ఇక గోడ మీద పిల్లి వాటంలా ఉండే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాస్తోకూస్తో అధికారం ఉన్నవాళ్లు కిమ్మనకపోవడం.. ఏ అధికారం లేని వాళ్ళు రోడ్డెక్కినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇదే వైసీపీ నేతలకు కలిసి వస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై అక్రమ కేసులు బనాయించడం, ఆస్తులపై దాడులు చేయిస్తూ టీడీపీలో ఐకమత్యం దెబ్బతీసింది. సాటి తెలుగుదేశం నేతపై దాడులకు పాల్పడుతున్నా కొందరు టీడీపీ నేతలు బహిరంగంగా విమర్శించే సాహసం చేయలేకపోతున్నారు. పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు… మాజీ ఎమ్మెల్యే వి. అనిత ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆందోళనలకు ఎటువంటి పర్మిషన్ లు లేకపోవడం టీడీపీకి మైనస్ అయినా.. ముందస్తు అనుమతులతో ప్రస్తుతం వామపక్షాలు అనేక అంశాలపై ఆందోళన బాట పట్టాయి. ఇప్పటికైనా టీడీపీ నాయకులకు ఎదురు తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎదురుదాడి తప్పదు..
విశాఖలో టీడీపీ నాయకులు ఎదురు దాడికి దిగితే తప్ప పరిస్థితులు సద్దుమణిగేలా లేవు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో చలామణీ అవుతున్న ఎందరో నాయకులు గతంలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం వంటి పార్టీల్లో నాయకులుగా కొనసాగిన వాళ్లే. వారి హయాంలోనూ అనేక అక్రమాలు చేసిన వాళ్లే. ఆయా నాయకుల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు ఇలా ప్రతి చోట ఏదో ఒక లోపాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటినీ వెలికితీసి ప్రజా కోర్టు ముందు ప్రవేశ పెడితే గాని అధికార పార్టీ ఆత్మరక్షణలో పడదు. కానీ అంతటి నెట్‌వర్క్, అంతటి సాహసం చేసే నాయకులు టీడీపీలో కనిపించడం లేదు. ఆ దమ్ము లేని టీడీపీ నాయకుల కారణంగానే విశాఖపట్టణంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆటలు సాగుతున్నాయి.