గీతం విశ్వవిద్యాలయంలో కొన్ని కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. గీతం విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. జె సి బి, ఇతర యంత్రాలతో అర్ధరాత్రి నుంచి కట్టడాలను కూల్చివేతను జీవీఎంసీ అధికారులు ప్రారంభించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు అంటూ గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆరోపించింది. గీతం విశ్వవిద్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులుచేరుకుంటున్నారు.
గీతం విశ్వవిద్యాలయ అధినేత శ్రీభరత్ గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
ఇటీవలి కాలంలో ప్రత్యేకించి విశాఖపట్టణంలో జీవీఎంసీ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు బాగా జోరుగా సాగుతున్నాయి. వీటిలో ప్రత్యేకించి తెలుగుదేశం నాయకుల మీద పగబట్టినట్టుగా, టార్గెట్ చేసినట్టుగా చేస్తున్నారు. తెదేపా నాయకులు, ఇళ్లు ఆస్తుల కూల్చివేతల మీద స్పెషల్ ఫోకస్ స్పష్టంగా కనిపిస్తోంది. అన్నీ అర్ధరాత్రి దాటిన తర్వాతనే చేపడుతున్నారు.
అన్ని రకాల అనుమతులతోనే నిర్మణాలు చేశామని తెదేపా నాయకులు చెబుతున్నా పట్టించుకుంటున్న దిక్కులేదు. ఇటీవల జీవీఎంసీ మేయర్ గా కూడా గతంలో సేవలందించిన సబ్బం హరి విషయంలోనూ అదే జరిగింది. తెల్లవారుఝామునే వచ్చి ఆయన ఇంటికి ఒకవైపున ఉన్న బాత్రూం ఇతర నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఆయన ఆగ్రహంగా కామెంట్లు చేయడంతో పెద్ద వివాదం కూడా రేగింది. ఇలా తెలుగుదేశం నేతల ఆస్తులు ధ్వంసం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా గీతం విశ్వవిద్యాలయం వంతు వచ్చింది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందినదే కావడంతో.. ఇలా కూల్చివేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఎందుకు కూల్చివేస్తున్నారో, కనీసం కారణం కూడా చెప్పలేదని గీతం యాజమాన్యం అంటోంది. బీచ్ రోడ్ లో గీతం కు వెళ్లే మార్గాన్ని రెండు వైపులా అధికారులు మూసివేసారు. భారీగా పోలీసులను మోహరించారు. ఇంత పోలీసు బందోబస్తు మధ్య ఇలా అర్థరాత్రి కూల్చివేతలు ఏమిటో అర్థం కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.