ఏపీ రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి.. ఈసారి వేదిక హస్తినకు మారింది.. గత కొంతకాలంగా కేవలం ప్రచారానికే పరిమితం అయిన టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు వాస్తవంలోకి వస్తోంది.. హస్తిన కమలనాధులతో చర్చల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.. ఇటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం హస్తినకి వెళుతున్నారు. ఈ ఇద్దరితో కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో మూడు పార్టీలు కలిసిపోటీ చేసే స్థానాలు, అభ్యర్ధుల ఎంపికపై సుదీర్ఘ చర్చ జరగనుంది..
ఇప్పటికే ఈ మూడు పార్టీల మధ్య పొత్తుపై సూత్రప్రాయం అంగీకారం కుదిరిందని రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతోంది. అంతర్గతంగా గత ఏడాదిగా మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.. ఎన్నికల సమయంలో అది పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి.. జనసేన – టీడీపీ పోటీ చేయబోయే స్థానాలపై ఇప్పటికే అంగీకారం కుదిరింది.. బీజేపీకి కేటాయించబోయే టికెట్లపైనే పీట ముడి నెలకొంది.. అది కూడా నేటితో వీడనుంది..
ఏపీలో జగన్ సర్కార్‌పై కొన్ని వర్గాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.. దీనికి బీజేపీ పొత్తులోకి ఎంట్రీ ఇస్తే అధికారుల సహాయసహకారాలు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి వస్తుందనే భావన ఉంది.. ఇక, ఎన్నికల సమయంలో జరిగే ఈడీ, ఐటీ వేటల షరా మామూలే.. ఇవి అన్నీ జగన్ టీమ్‌ని కలవరపెడుతున్నాయి.. 2019 ఎన్నికలలో జగన్.. ఏ అంశాలతో టీడీపీని ఇరుకున పెట్టారో, అదే వ్యూహంతో ఈ దఫా రివర్స్ గేమ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత కలలో కూడా ఊహించని పొత్తు ఇది..
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించినట్లు.. బీజేపీతో జగన్ స్నేహం ఆయన కొంపముంచనుండడం ఖాయంగా కనిపిస్తోంది.. అయిదేళ్లుగా బీజేపీతో అంటకాగి, నేడు ఆ పార్టీని చిన్న విమర్శ కూడా చేయలేని స్థితికి చేరుకున్నారు జగన్.. ఈ అంశాలే వైసీపీ అగ్రనాయకత్వానికి పెనుసవాల్‌గా మారుతున్నాయి.. అందుకే, చంద్రబాబు ఎప్పుడయితే కమలనాధుల హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లిపోయారో అప్పటినుండే జగన్ పతనం మరింత భారీగా పడిపోవడం కనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.. మరి, ఈ డ్యామేజ్‌ని జగన్ కవర్ చేసుకోగలరో లేదో చూడాలి.