కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తెదేపా నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ పై వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో లోకేశ్ వారికి అదే స్థాయిలో చురకలు అంటించారు.
రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీరు ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవాల్సింది పోయి మేము వెళ్తే మా మీద అనవసర కేసులు బనాయిస్తున్నారు. వరద నష్టం జరిగి ఇన్ని రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రైతుకు పరిహారం అందలేదు. బాధితులను ఆదుకోవాల్సింది పోయి మేము వెళ్తే అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మావి అన్ని స్కాములు అని చివరికి ట్రాక్టర్ సరిగా నడపలేదు అని కేసు పెట్టారు. ఇదేనా మీ తీరు అంటూ ప్రశ్నించారు.
కావాలంటే మీ బిల్డింగులు తాకట్టు పెట్టండి..
నాలుగు వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగిస్తామని చెబుతున్నారు. అప్పులు తీర్చడానికి జగన్ చెన్నైలో కొత్తగా కడుతున్న భవనాన్ని తాకట్టు పెట్టండి. మీ ప్యాలెస్ లు తాకట్టు పెట్టి అప్పులు తీర్చుకోండి. అంతే కానీ రైతుల మీద భారం మోపకండి అని పేర్కొన్నారు.
పొలాల్లో మీటర్లు బిగిస్తే వాటిని పీకి, సైకిళ్లకు కట్టి ఊరేగిస్తామన్నారు. ఏడాదిన్నర కాలంలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటమేనా రైతు రాజ్యం అంటే అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు రైతులకు జరిగిన నష్టాన్ని 100 శాతం అంచనా వేయాల్సి ఉంటుంది.
పరిహారం చెల్లించాలి..
వరదలు వల్ల రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. పంటను కోల్పొయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి. ఆక్వా రంగం కుదేలైనందుకకు ఎకరాకు రూ. 5 లక్షలు చెల్లించాలి. దెబ్బ తిన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించి రైతులను ఆదుకోవాలని లోకేశ్ కోరారు.
వరదల వల్ల ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి. రైతులను ఎగతాళి చేస్తే జగన్ ను గోచీతో నిలబెట్టే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి రైతులను తక్కువ చేయకుండా వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.











