(విశాఖపట్నం నుంచి లియో ప్రతినిధి)
విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విశాఖలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న చందంగా మారింది. మూడు రాజధానులు అంశం పై ఇప్పటికే అధికార పక్షానికి విపక్షానికి మధ్య భారీ యుద్ధమే నడుస్తోంది. ఈ తరుణంలో విశాఖలో ఉన్న టిడిపి నాయకులు పార్టీ ఆదేశాల మేరకు వ్యతిరేకించే లేక, మద్దతు పలకలేక నలిగిపోతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసిపి హవా కొనసాగినా, విశాఖ నగరంలో మాత్రం కీలకమైన నాలుగు స్థానాలను టిడిపి దక్కించుకుంది. విశాఖ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన వెంటనే దాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అమరావతి నే కొనసాగించాలి అన్న నినాదంతో ఉద్యమ బాట పట్టింది. దీంతో అధికార పార్టీ విశాఖలోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వచ్చింది. విశాఖలోని ఎమ్మెల్యేలు అభివృద్ధిని కోరుకుంటున్నారా? లేదా? స్పష్టంగా స్పష్టంగా చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు పదేపదే రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేసినప్పటికీ, ఘాటుగా ప్రతిస్పందించే పరిస్థితి లేకుండా పోయింది.
విశాఖ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు రాజధాని నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లను ద్రోహులుగా చిత్రీకరించాలన్నది వైసిపి పన్నాగం. దానిని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం నాయకులు కూడా తమదైన పంథాను అనుసరించారు.
విశాఖ వాసులు గా తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు అనుకూలమే అయినప్పటికీ, అమరావతిలోన రాజధాని రైతులకు న్యాయం చేయడమే తమ ప్రధాన అజెండా అంటూ విశాఖ ప్రజల ముందుకు వచ్చారు. విశాఖ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న విషయంలో దుందుడుకుగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ నేతలకు వ్యతిరేకంగా, వైసీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పి . గణబాబు, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ కీలకంగా ఉన్నారు. అంతా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేసే పరిస్థితి ప్రస్తుతం విశాఖలో లేదు. రాజధాని చేయాలన్న ప్రతిపాదనపై వీరు ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడిన జిల్లావ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేసేందుకు వైసీపీ వ్యూహరచన చేసుకుని ఉంది.
గంటా ‘వీడుకోలు మౌనం’!
గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఉంది. దాన్ని బలపరిచే విధంగానే… ఆయన ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారు. ఎన్నికల తర్వాత అసలు తెలుగుదేశం పార్టీతో పూర్తిగా కటీఫ్ చెప్పేసిన విధంగానే నడుచుకుంటున్నారు. ఇప్పటికే ఆయన రాకను వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గంలో అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు క్యాపిటల్ వ్యతిరేకిస్తే అంతా ఆందోళన నిర్వహించేందుకు మాత్రం వెనుకడుగు వేసే పరిస్థితి లేదు . ఉత్తరాంధ్ర అభివృద్ధిని తెలుగుదేశం అడ్డుకుంటుంది అంటూ ఇప్పటికే ప్రచారం చేయడంలో వైసిపి సఫలీకృతమైంది. దీంతో అమరావతికి మద్దతుగా విశాఖలో ఆందోళన తీవ్రతరం చేసే నాయకులు కానరావడం లేదు. ఈ సంకట పరిస్థితిని ఇప్పటికే చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినా విశాఖ నగర ఎమ్మెల్యేలు ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టడం లేదు. దీంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యతిరేకిస్తున్నారన్న వాదన తెరపైకి రావడం లేదు. ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు కూడా ఎమ్మెల్యేలు వెనుకడుగు వేస్తున్నారు.
ప్రజా విముఖతను పట్టుకోలేకపోయిన ప్రతిపక్షం
ప్రతిపక్షం ఫోకస్ మొత్తం.. అమరావతినుంచి రాజధాని తరలిపోవడం పట్ల అక్కడి రైతుల వ్యతిరేకత మీదనే కేంద్రీకృతం అయింది. అదే సమయంలో.. విశాఖ ప్రజల్లో, ఇక్కడకు రాజధాని రావడం గురించి ఎంత వ్యతిరేకత ఉందో వారు గమనించలేకపోయారు. దాన్ని సరైన సమయంలో పసిగట్టి, దానికి దన్నుగా నిలిచి ఉంటే.. ఇప్పటి పరిణామాలు ఇంత త్వరగా వచ్చేవి కాదు.
స్థానికంగా వాస్తవాలను పరిశీలిస్తే.. విశాఖ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనే డిమాండ్ గానీ, ఆలోచన గానీ విశాఖ ప్రజలకు లేదు. అదేవిధంగా వ్యతిరేకించేవారు కూడా అతి తక్కువ మంది మాత్రమే! రాష్ట్ర రాజధానిగా అవతరిస్తే విశాఖలో క్రైమ్ రేట్ పెరుగుతుందని, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందని భయం అనేక వర్గాల్లో ఉంది. ఈ అంశాలను హైలెట్ చేయడంలో ప్రతిపక్షాలు విఫలం కావడంతో ఉత్తరాంధ్ర వాసులంతా మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారనే వాదనే వినిపిస్తోంది. ఇప్పటికైనా తెలుగు దేశం పార్టీ విశాఖలో వ్యూహాత్మకంగా అడుగులు వేయకుంటే తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.










