ఏపీలోని అధికార వైసీపీలో పవర్ సెంటర్ల వార్ తారా స్థాయికి చేరిందనే చర్చ ఆ పార్టీలోనే మొదలైంది. సీఎం జగన్ తరువాత పొజిషన్ కోసం ఈ వార్ జరుగుతుండడం, మరికొందరు నాయకులు తమ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారన్న విమర్శలూ మొదలయ్యాయి. ప్రధానంగా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి టీం వర్సెస్ విజయసాయిరెడ్డి టీం అన్నట్లుగా పరిస్థితి మారిందనే చర్చ నడుస్తోంది. మొన్న అనంతపురం జిల్లాలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు చేయడం రాజకీయంగా సంచలనం రేపినా పార్టీలో ఆయన పవర్ గురించి అంతర్గతంగా చర్చ మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే..పోలీసు యంత్రాగాన్ని అనధికారికంగా నడిపిస్తోంది ఈయనేనని టాక్ వచ్చేసింది. ప్రభుత్వంలో హోం మంత్రితో పాటు ఆయా జిల్లాల్లో మంత్రులు ఉన్నా.. పోలీసు శాఖకు సంబంధించి ఏ విషయమైనా ఈయన అనుమతి ఉంటేనే.. ఫైళ్లు కదులుతున్నాయని చెబుతున్నారు. నాలుగైదు నెలల క్రితం వరకు జిల్లా స్థాయిలో మంత్రులకు కొన్ని అంశాల్లో ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదని, అందుకే కొందరు మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే గతంలో బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు..ఉత్తరాంధ్రకు చెందిన కీలకమైన రాజ కుటుంబ ఆస్తుల వ్యవహారంలోనూ ఇదే జరిగిందని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక్కడే పవర్ సెంటర్ల వార్ అంశం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.
సజ్జలకు టచ్‌లో ఉత్తరాంధ్ర లీడర్లు
ఏపీలో జగన్‌ని సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూస్తున్నారు. విశాఖలో మకాం వేసి పార్టీ వ్యవహారాలు, కొన్ని అధికారిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియాను కూడా విజయసాయిరెడ్డి నడిపిస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కొన్నాళ్లుగా అక్కడా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల్లోనూ అసంతృప్తి మొదలైంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు డైరెక్ట్‌గా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేయడం, ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం పార్టీకి డామేజీగా మారిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా సజ్జల ఎంటర్ అయ్యారని చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో మరో సీనియర్ నేత, తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పే మరో మంత్రి సజ్జల వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర లీడర్లు సజ్జలకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలే పార్టీలో చర్చకు కారణం అయ్యాయి.
విజయసాయిరెడ్డికి రాయలసీమ బాధ్యతలు ?
ఇక పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. త్వరలోనే విజయసాయిరెడ్డికి రాయలసీమ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అంటే ఉత్తరాంధ్ర విషయాల నుంచి తప్పించి రాయలసీమకు పరిమితం చేయడం లేదా ఢిల్లీకి పరిమితం చేయనున్నారని తెలుస్తోంది. అదే టైంలో పార్టీకి సంబంధించి ఉత్రరాంద్ర విషయాలను సజ్జల పర్యవేక్షించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంత పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సజ్జలకు రాయలసీమలో పార్టీ వ్యవహారాలపై ఎలాగూ గ్రిప్ వచ్చిందని, ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తే..తమకు ప్రాధాన్యం ఉంటుందనే ఆశతో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీలో నెంబరు టూ స్థానం విషయంలో సజ్జల టీం వర్సెస్ విజయసాయిరెడ్డి టీం అనే రచ్చ మొదలు కానుందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.