టీమిండియా ఆసీస్ పర్యటన ఆద్యంతం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. బోర్డర్- గావస్కర్ సిరీస్ గురించి నిత్యం ఏదో ఓ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం మన క్రికెటర్లు ఆసీస్ లో బాత్రూమ్ లు కడిగారనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ సారధి గంగూలీ సైతం అసహనం వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. మరి ఆ వార్తల్లో వాస్తవమెంత? మన క్రికెటర్లు నిజంగానే ఆసీస్ లో బాత్రూమ్ లు కడిగారా?
కరోనా ప్రపంచాన్నే తలకిందులు చేసేసింది. ఎందరో జీవితాలను కుదిపేసింది. ఎప్పుడూ వినని.. ఎవరూ ఊహించని ఎన్నో విషయాలను పరిచయం చేసేసింది. ఓవరాల్ గా చెప్పాలంటే.. మనిషి జీవన విధానాన్నే మార్చేసింది. ఆ పీడ 2020తోనే విరుగుడైపోతుంది అనుకుంటే.. 2021లోనూ చుక్కలు చూపిస్తోంది. ఆసీస్ పర్యటనలో టీమిండియాకు కొవిడ్ తిప్పలు తప్పడం లేదు. కరోనా పరీక్షలని.. క్వారైంటైన్ తప్పదని.. ఇలా ఎన్నో ఇబ్బందులను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడేమో.. బాత్రూమ్‌లు సైతం కడగాల్సిన దుస్థితి నెలకొంది.
బయోబబుల్ ని’బంధనాలు’
టీమిండియాకు ఆసీస్ కఠిన నిబంధనలు విధిస్తోంది. బయో- సెక్యూర్ బబుల్ నిబంధనలు విధించింది. ఈ నిబంధన ప్రకారం భారత క్రికెటర్లతో ఎవరికీ ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదు. దీంతో హోటల్ మొత్తాన్ని ఖాళీ చేయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హౌస్ కీపింగ్, రూమ్ సర్వీస్ చేసే సిబ్బందిని సైతం హోటల్ నుంచి పంపించేశారు. అలానే రెస్టారెంట్, జిమ్ రూములకి తాళాలు వేసేశారు. స్విమ్మింగ్ పూల్‌ని కూడా వాడుకునేందుకు వీలు లేదు. ఫలితంగా.. ఇప్పుడు ఆ హోటల్‌లో కేవలం భారత క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. ఫుడ్ కూడా ఆ హోటల్‌కి సమీపంలో ఉన్న భారత రెస్టారెంట్ నుంచి తెప్పించి ఓ ఫ్లోర్‌తో ఉంచుతున్నారు. మొత్తంగా భారత క్రికెటర్లని ఇప్పుడు ఆ హోటల్‌లో బంధించినట్లయింది.
గంగూలీ సీరియస్ అయ్యారా?
భారత్- ఆసీస్ నాలుగోటెస్టు బ్రిస్బేన్ లో జరుగుతోంది. ఈ నెల 15న ప్రారంభమైన మ్యాచ్.. 19 వరకూ కొనసాగుతుంది. టీమిండియా కోసం స్టేడియానికి 4 కిలోమీటర్ల దూరంలోని సోఫిటెల్ అనే ఓ ఫైవ్ స్టార్ హోటల్ ను కేటాయించారు. అక్కడే మన క్రికెటర్లు బాత్రూమ్ లు శుభ్రం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సీరియస్ అయినట్టు వార్తలొస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం.
“ఆసీస్ పర్యటనలో చాలా అవస్థలు పడుతున్నాం. ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకోవాల్సి వస్తోంది. స్టేడియంలో అలసిపోయి విశ్రాంతి కోసం రూంకి వస్తే.. ఇక్కడ పనితో విసిగిపోతున్నాం. మా బెడ్స్ మేమే సర్దుకుంటున్నాం. బాత్రూమ్‌లు కడుక్కుంటున్నాం. హోటల్ మొత్తం ఖాళీగా ఉంది. కఠిన నిబంధనల కారణంగా హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్, జిమ్‌ను కూడా వాడుకోవడం లేదు. హోటల్లోని రెస్టారెంట్స్, కేఫ్స్ అన్నీ మూసేశారు. టోటల్ గా ఇక్కడ మేం బందీలుగా బతుకుతున్నాం.” అని జట్టుకు సంబంధించిన ఒకరు తెలిపినట్టు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.











