కేవలం సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకోవాడమే కాదు మానవత్వం చాటే విషయంలోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందున్నారు. ఇప్పటికే చిన్న పిల్లలకు సర్జరీలు చేయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహేష్.. తాజాగా తన సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేశాడు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకి ప్రిన్స్ మహేష్ ఒకే రోజు 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 30 మంది చిన్నారులకు మహేష్ ఆపరేషన్ లు చేయించారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్ వేధికాగా అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రా ఆసుపత్రి యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మహేశ్ బాబు ఉదారతపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్ బాబు గ్రేట్ అని కొనియాడుతున్నారు.ఇప్పటికే గుండె సంభందిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు తిరిగి మామూలు మనుషులు అయ్యేందుకు మహేష్ ఓ చారిటీ సంస్థ స్థాపించారు. దాని ద్వారా సుమారు వెయ్యి మంది చిన్నారులకు అవసరమైన వైద్యం అందించారు. అంతేకాకుండా మరింత మంది చిన్నారులకు సేవలు అందించడానికి రెయిన్ బో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో “ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్” తో మహేష్ ఫౌండేషన్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఎంబీ ఫౌండేషన్ పేరుతో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ..ఎంతోమంది చిన్నారులకు ఈ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ మహేష్ ఎందరో చిన్నారులకు అండగా నిలుస్తున్నారు.
ఒకవైపు సూపర్ స్టార్ ఇమేజ్ తో సినీ ఇండస్ట్రిలో రికార్డులు సృష్టిస్తున్న మహేష్ బాబు సామాజిక సేవలోనూ దూసుకుపోతున్నారు. తన వంతుగా వీలైనంత మందికి సహాయం చేయడమే లక్ష్యమని మహేష్ చెప్పకనే చెబుతున్నాడు. మరి మహేష్ ఆలోచనలు ఇంకెంతమంది హీరోలకి ఇన్స్పిరేషన్ గా మారుతుందో చూడాలి.