కరోనా మహమ్మారి విజృంభించింది. బతుకులు అతలాకుతలం చేసింది. జీవితాలను కనీసం ఐదారేళ్లు వెనక్కి తీసుకుపోయింది. ఆ దేశం, ఈ దేశం అని లేదు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు. ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు. ఆ మండలం ఈ మండలం అని లేదు. చివరికి ఆ గ్రామం ఈ గ్రామం అని కూడా లేదు. యావత్ ప్రపంచాన్ని మహమ్మారి కరోనా కమ్మేసింది.
ఏడు నెలల పాటు జీవితాలు రోడ్డున పడ్డాయి. వర్క్ ఫ్రం హోం అంటూ కొత్త మాటలు తెరమీదకొచ్చాయి. ముక్కుకి, నోటికి మాస్కులంటూ కొత్త ఆహార్యం కూడా అనివార్యం అయ్యింది. ఇలాంటి ఆపత్కాల సమయంలో ప్రభుత్వాలు ప్రజలను అక్కున చేర్చుకోవాలి. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు మీకు మేమున్నాం అన్న భరోసా ఇవ్వాలి.
మీ సమస్యలు మావే అనే ధీమా కలిగించాలి. మీ బతుకులకు మా పాలన గ్యారంటీ అని భుజాల మీద చెయ్యి వేయాలి. ఈ పని తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ చేస్తే బాగుండునని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు పాలకుల వైపు చేతులు చాచి నిలబడ్డారు.
గుజరాత్ చేసింది.. ఒడిశా చేస్తోంది
కరోనా కాలంలో ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులుం చేయకుండా గుజరాత్ ప్రభుత్వం కట్టడి చేస్తోంది. అక్కడి ప్రయివేట్ పాఠశాలలకు కొన్ని నిబంధనలు విధిస్తోంది. ఆ నిబంధనల మేరకు ప్రయివేట్ పాఠశాలల్లో వివిధ తరగతులకు నిర్ణయించిన ఫీజులలో 25 శాతం రాయితీ ఇవ్వాలంటూ ఆదేశించింది. అక్కడి ప్రయివేట్ పాఠశాలలతో విద్యాశాఖ మంత్రి నేరుగా సమావేశం ఏర్పాటు చేసి “సామాజిక బాధ్యత మీకూ ఉంది” అని గుర్తు చేశారు.
గుర్తు చేయడమే కాదు… “మీరు అలా చేయకపోతే కష్టాలే” అని హెచ్చరించారట కూడా. దీంతో గుజరాత్ లోని ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం చెప్పిన విధంగా ఫీజులలో రాయితీలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని గుజరాత్ విద్యాశాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రమైన ఒడిశా కూడా ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చిస్తోంది.
ఇక్కడైతే 25 శాతం కాదు… 30 శాతం ఫీజులు తగ్గించాలంటూ నిబంధనలు విధించింది. ఈ నిబంధనకు బడిసాలోని ప్రయివేట్ పాఠశాలలు కూడా దాదాపు అంగీకరించినట్లు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ఆ రెండు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు తెరుచుకోవడంతో పాటు ఫీజుల నిబంధనలు కూడా అమలులోకి వస్తాయంటున్నారు.
తెలుగు సీఎంలు ఏం చేస్తారో..
గుజరాత్, ఒడిసా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఫీజుల నియంత్రణ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుండునని రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. రెండు రాష్ట్రాలలోనూ ప్రయివేట్ పాఠశాలలు లక్షల్లో ఫీజులు వసులు చేస్తున్నాయి. దీన్ని నియంత్రించేందుకు కరోనా సమయమే కలిసి వస్తుందని తెలుగు వారు ఆశిస్తున్నారు. ప్రెవేటు స్కూళ్ల కొవిడ్ దోపిడీ రెండు రాష్ట్రాల్లోనూ కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి ఫీజు రాయితీలు సాధిస్తే రాజకీయంగా కూడా వారి అనుకూలంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి తెలుగు ముఖ్యమంత్రులు ఏం చేస్తారో.











