విజయనగరం గజపతుల వారసునిగా , సచ్ఛీలునిగా, నిజాయితీకి నిలువెత్తు రూపంగా పేరుగాంచిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును, ఆయన సోదరుడు పూసపాటి ఆనందగజపతి రాజు తనయ సంచైత గజపతిరాజు అడ్డంగా బుక్ చేసే పనిలో పడ్డారు. మాన్సాస్ ముసుగులో రాజుగారు చేసిన రాచకార్యాలు అవకాశం వచ్చినప్పుడంతా ఒకటికొకటిగా బయట పెడుతూ ఆయనపైనున్న సచ్ఛీల ముద్రను బజార్లో పెట్టేస్తున్నారు.
మాన్సాస్ విచ్ఛిన్నానికి ప్రయత్నం : అశోక్ గజపతిరాజు
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన ఎమ్మార్ కళాశాల ప్రైవేటీకరణపై గురువారం మధ్యాహ్నం తన బంగ్లాలో అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకోసం ఏర్పాటు చేసిన మాన్సాస్ సంస్థకి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయని, మాన్సాస్ సంస్థ ఉద్దేశాలను మాన్సాస్ ఛైర్ పర్సన్ గౌరవించడం లేదని, ఏపి ప్రభుత్వం కూడా వ్యవస్థలను చట్టాలను గౌరవించడం లేదని దుమ్మెత్తిపోశారు.
మాన్సాస్ ట్రస్ట్ విచ్ఛిన్నం కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు, అది అందరికీ తెలుసని పరోక్షంగా సంచైతను, జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మహారాజ కాలేజి ప్రైవేటీకరణ ఏందుకో మాన్సాస్ చైర్మన్ చెప్పాలని ప్రశ్నించారు. దీనివల్ల లాభ నష్టాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత నేతలంతా ఆ కాలేజీలోనే విద్యను అభ్యసించారని, నేను చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా చాలా ప్రపోజల్స్ వచ్చాయని, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వాటిని తిరస్కరించానని చెప్పుకొచ్చారు. మాన్సాస్‌కు 125 కోట్లు ఫిక్సెడ్ డిపాజిట్లు ఉన్నాయని, వేల ఎకరాలు భూములు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొవాలని హితవుపలికారు.
దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సంచైత
రాష్ట్రంలో రెండురోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఎమ్మార్ కాలేజీ అంశంపై పూర్వ ఛైర్మన్ అశోకగజపతి స్పందించి తప్పంతా ప్రస్తుత ఛైర్‌పర్సన్, ప్రభుత్వానిదే అని నిందించడంతో దానిపై మాన్సాస్ ఛైర్‌పర్సన్ సంచైత గజపతిరాజు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.
సంచైత గజపతి రాజు ప్రకటన యథాతథంగా …
01–10–2020
విశాఖపట్నం
పత్రికా ప్రకటన
ఎం.ఆర్. కాలేజీపై అశోక్‌గారివి తప్పుడు ప్రచారాలు
-మాన్సాస్, సింహాచల దేవస్థానం ఛైర్మన్ సంచైతా గజపతిరాజు
ఎం.ఆర్. కాలేజీ గురించి సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్‌గారు చేస్తున్న తప్పుడు సమాచారం నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారని ఊహించలేదు. ఎం.ఆర్. కాలేజీ స్వతంత్ర ప్రతిపత్తికలిగిన ప్రయివేటు కాలేజీ. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఎయిడెడ్ హోదాను 2017లో ఆయనే సరెండర్ చేశారు. అప్పుడు తీసుకున్న విధాన నిర్ణయం కొనసాగుతోంది. ఇందులో ప్రభుత్వం జోక్యంకాని, సంబంధం కాని లేదు. ఈ విషయాన్ని ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు. దయచేసి మీ చిల్లర రాజకీయాల్లోకి మాన్సాస్ విద్యాసంస్థలను లాగవద్దు.
అశోక్‌గారు మాన్సాస్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తప్పుడు వివరాలు ఇవ్వటం మూలాన మాన్సాస్ కాలేజీలకు రూ.6.5 కోట్లు నష్టం వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్‌గారు డిస్కౌంట్‌గా ఈ డబ్బు ఇచ్చారేమో? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఈ డబ్బును తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సరైన అనుమతులు లేని కారణంగా 2018–2020లో 170 మంది విద్యార్థులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండా పోయాయి. అశోక్‌గారి హయాంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. వారిని జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. నేను వచ్చాక ఈ సమస్యపై దృష్టిపెట్టాను.
అశోక్‌గారు తన రాజకీయ ఆటలకోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారిపట్టించారో ఒక్కసారి ఆలోచనచేయమని కోరుతున్నా.
ఇట్లు
సంచైతా గజపతిరాజు
ఈ ప్రకటన చూసిన తరువాత మాన్సాస్ ముసుగులో అశోక్ గజపతిరాజు ఇటువంటి పనులకు పాల్పడ్డారా అనే సందేహం ఒకవైపు, ‘తీగ లాగితే డొంక కదులుతోంది’ అని మరోవైపు ప్రజలు భావిస్తున్నారు. ఎమ్మార్ ప్రైవేటీకరణ వ్యవహారాన్ని సంచైతపై తోసేయాలని ప్రయత్నిస్తే అశోక్ అడ్డంగా బుక్కాయ్యారనే అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ‘డేమిట్.. అశోక్ కథ అడ్డం తిరిగింది’ అనేమాట అందరినోటా వినిపిస్తోంది.
ఏదేమైనా ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణను అంగీకరించేదిలేదని వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ఇప్పటికే రోడ్డెక్కాయి. సంచైత మాత్రం ఇప్పటికే అది ప్రెవేటు కాలేజీ అని కుండబద్ధలు కొడుతున్నారు. ఇందుకు బాధ్యులు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి.











