పార్టీ పదవులు ఇవ్వాలనో, మరింకేదైనe అవసరం తీర్చమనో కేడర్ ఇప్పుడు చంద్రబాబును అడగడం లేదు. కాకపోతే, జాతీయాధ్యక్షుల వారిని కొంచెం మారమని విన్నవించుకుంటున్నారు. ఆయన వైఖరిని మార్చుకోమంటున్నారు.
హైదరాబాద్ లో కూర్చోకుండా నాయకులకు, కార్యకర్తలకు అండగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉండమంటున్నారు. చంద్రబాబు నాయుడు- తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మరింత స్థిరంగా ఉంచడం కోసం.. భవిష్యత్ దార్శినిక పరిస్థితుల్ని ఇప్పుడే ఊహించుకుని పార్టీ పటిష్టపడడానికి భవిష్యత్తు వ్యూహ రచన చేయమంటున్నారు.
ఇటీవల నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలపై అంతగా దృష్టి పెట్టడం లేదని, ఎవరికి వారు తమకు తామే అధికులమంటూ పార్టీలో వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అమరావతి రాజాధానిగా ప్రభుత్వంపై యుద్దం చేయడం సమంజసమే అయినా అదొక్కటే సమస్య కాదని, ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాలలో జరుగుతున్న ప్రజావ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రతిపక్షంగా ఉండవలసిన తెలుగుదేశం పార్టీ నానాటికి బలహీన పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏ జిల్లాలోను కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను సమీకరిచండం సమావేశాలు నిర్వహించడం వంటివి చేయడం లేదని, దీంతో కార్యకర్తలలో నిరుత్సాహం పెరుగుతోందని అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్లేనా.. ప్రజల దగ్గరకి రారా
తెలుగుదేశం నాయకుడు లోకేష్ సహా సీనియర్లందరు ట్వట్టర్లలో విమర్శలు చేసేందుకు పరిమితమవుతున్నారే తప్ప, క్షేత్ర స్దాయిలో ప్రజల వద్దకు ఎవరూ రావడం లేదని విమర్శిస్తున్నారు. “కరోనా భయంతో నాయకులు విలేఖరుల సమావేశాలు కూడా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నారు. కరోనాతో మనుషులు ఎలా మంచం ఎక్కుతున్నారో తెలుగుదేశం పార్టీ కూడా రోజు రోజుకు చిక్కిపోతోంది” అని పేరు వెల్లడించడానికి అంగీకరించని ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు ఒకరు లియో ప్రతినిధితో వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ ఉనికి లేకుండా పోయిందని, ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి రాకూడదంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ట్విట్టర్ల తోను, సోషల్ మీడియా తోను పార్టీ పటిష్టం కాదని, క్షేత్ర స్దాయిలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తేనే పార్టీ నిలబడుతుందని వారు అంటున్నారు.
సీమలో చేయి దాటుతున్న దేశం
రాయలసీమ జిల్లాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలలోను తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కాస్తో కూస్తో పటిష్టంగా ఉన్న అనంతపురం జిల్లా నాయకులపై కేసులు పెట్టడంతో అక్కడ కూడా పరిస్థితి దిగజారుతోంది. దీని నుంచి బయట పడాలంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాలలో విసృతంగా పర్యటించాలని, ఆ జిల్లాలలో సీనియర్ నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని సూచిస్తున్నారు. వచ్చే మూడు సంవత్సారాలు ఒక వైపు పార్టీని కాపాడుకుంటూనే మరో వైపు పటిష్ట పరిచేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బాబూ… ప్లీజ్ మారండి బాబు అని విన్నవించుకుంటున్నారు.











