తెలంగాణలో అధికారులు.. ఆ స్దాయి ఈ స్దాయీ అని లేకుండా కోట్లకు కోట్ల అవినీతికి పాల్పడుతుండడం అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. కింది స్దాయి ఉద్యోగి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అవినీతి ఊబిలో కూరుకు పోతుండడం ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడ విస్మయం కలిగిస్తోంది. మెదక్ అదనపు కలెక్టర్ కోటి రూపాయలకు పైగా లంచం డిమాండ్ చేయడం 40 లక్షలు అవినీతి సొమ్ముతో దొరికి పోవడం కలకలం రేపింది.
అంతకు 15 రోజుల ముందు తాహసీల్దార్ నాగరాజు 1.12 కోట్లు నగదు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. ఈ అవినీతి రికార్డులకు ఎక్కింది. పైగా దీని వెనుక కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు కూడా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యు శాఖలో అవినీతికి తావు లేకుండా పోయింది. రెవెన్యు ఇన్ స్పెక్టర్ నాగార్జున రెడ్డి 15 లక్షలతో అవినీతి అధికారులకు దొరికిపోయారు.
తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 2011 నుంచి 2020 ప్రస్తుతం వరకు అత్యధిక లంచం తీసుకుంటూ 16 మంది అధికారులు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. వీఆర్ ఓల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాహసీల్దార్లు సంధ్య, అంతయ్య, డిప్యూటీ తాహసీల్దార్ శ్రీదేవి వంటి వారు లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. వీరితో పాటు దాదాపు 30 మంది కింది స్ధాయి అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుపడ్డారు.
న్యాయశాఖలోను అవినీతే
తెలంగాణాలో న్యాయశాఖ తీరు కూడా రోజురోజు దిగజారిపోతోంది. ఇక్కడ కూడా అవినీతి రాజ్యమేలుతోంది. ఈ వ్యవస్థపై పెదవి విప్పితే ఎక్కడ చేటు వస్తుందో అనే భయంతో చాలా మంది దీని గురించి మాట్లాడడం లేదు. గతంలో మైనింగ్ మహరాజు, బళ్లారికి చెందిన జనార్దన రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు ఓ న్యాయమూర్తి ఏకంగా లక్షలు తీసుకుని ఆనక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అంత వరకూ న్యాయవ్యవస్ధపై ఉన్న కాస్తో కూస్తో నమ్మకం ఈ సంఘటనతో కొంతమేర సన్నగిల్లింది. 2010 సంవత్సరంలో న్యాయాధికారిగా ఉన్న సత్యనారాయణ రెండు లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోవడం కూడా సంచలనం కలిగించింది.
పోలీసులూ అదే దారిలో…
తెలంగాణాలో పోలీసు వ్యవస్ధ చాలా పటిష్టంగా ఉందని ప్రభుత్వం చెబుతున్నా ఈ శాఖలో కూడా అవినీతి దారుణాతిదారుణంగా ఉందని చెబుతున్నారు. తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్ లోనూ డబ్బలు ఇవ్వనిదే పనులు జరిగే పరిస్థితి లేదంటున్నారు. అయితే, ఈ శాఖపై నిర్ధిష్టమైన సమాచారం లేకుండా దాడులు చేయడం కష్టం కాబట్టి వారిపై కేసులు నమోదు కావడం లేదని అంటున్నారు. అలాగే ఎవరైనా ఈ శాఖలోని వారిపై అవినీతి నిరోధక శాకకు ఫిర్యాదు చేసి వారిని పట్టిస్తే మిగిలిన పోలీసు అధికారులు ఫిర్యాదు చేసిన వారిని అన్ని విధాలుగా హింపించే అవకాశాలు ఉన్నాయి.
దీంతో ఈ శాఖపై ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. మరోవైపు అవినీతి ఎక్కువగా ఉందంటూ ప్రభుత్వ శాఖలను రద్దు చేసుకోవడం కంటే దానిని ప్రక్షాళన చేస్తేనే మంచిదనే సూచనలు వస్తున్నాయి. ఇలా రద్దు చేసుకుంటూ పోతే ప్రభుత్వంలో ఏ శాఖ మిగలదనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు.











