ఒక వైపు కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తుంటే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వైరస్ వ్యాప్తికి మరింత కారణమవుతున్నారు. విద్యాసంస్థలను తెరిస్తే ఎక్కడ కోవిడ్ వైరస్ వ్యాప్తి జరుగుతుందోనని ప్రభుత్వాలు పాఠశాలలను మూసివేస్తే కొందరి చర్యల వల్ల కోవిడ్ కేసులు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ఏపీలో ఓ వ్యక్తి ప్రైవేట్ ట్యూషన్ నిర్వహించి 14 మంది విద్యార్థులకు కరోనా వ్యాపించేలా చేశారు.
ఒక్కరి నుంచి 14 మందికి..
గుంటూరులో ఓ వ్యక్తి ప్రైవేటు ట్యూషన్ నిర్వహించాడు. అయితే అతనికే కరోనా రావడంతో వైరస్ పదుల సంఖ్యలో విద్యార్థులకు సోకింది. దీంతో ఆ ట్యూషన్ సెంటర్ కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు పరిశీలిస్తే సత్తెనపల్లి మండలంలోని భట్లురు గ్రామంలో ఓ వ్యక్తి ప్రైవేటు ట్యూషన్ నిర్వహించాడు. దాదాపు 50 మంది విద్యార్థులు ఆ ట్యూషన్ కు హాజరయ్యారు. అయితే ఆ ట్యూషన్ నిర్వాహకుడికి ముందస్తుగానే కరోనా సోకింది. దీంతో ట్యూషన్ కు హాజరైన 14 మంది విద్యార్థులకు కరోనా వ్యాపించింది.
కరోనా సోకిన వారిలో అత్యధికమంది చిన్నారులు 8 నుంచి 12 ఏళ్ల లోపు వారే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు మిగతా విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకిన విద్యార్థులను గుంటూరులోని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. కేసులు అధికంగా నమోదు కావడంతో భట్లూరు ఎస్సీ కాలనీని అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి విద్యార్థులతో కలిపి గ్రామంలో 250 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకే రోజు 39 కేసులు నమోదు కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
కరోనా నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్ సెంటర్ నిర్వహించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.