నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టిలో ఇద్దరు నేతలు తమ అనుయాయుల పదవుల కోసం అస్సలు పట్టు వీడడంలేదు. అందులో ఒకరు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. ఇద్దరూ అధికార పార్టీ నేతలే కావడంతో ఈ సమస్య ఎటూ తేలడం లేదట. దీంతో ఈ పంచాయితీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరకు చేరిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మార్కెట్ కమిటీ పదవి కోసం ఇద్దరు నాయకుల మధ్య వివాదం రాజుకుందని తెలిసింది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని మాల్ ఒక మండలం. అయితే మాల్ మార్కెట్ కమిటీ పదవుల కోసం తమ వర్గానికంటే…తమ వర్గానికేనని వివాదం రాజుకుందట. ఈ పదవి కోసం ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ అస్సలు పట్టువీడడంలేదని తెలిసింది. అలాగే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఆ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు.
రెండూ ప్రాంతాలు అందులోనే…
ఇద్దరూ అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వివాదానికి అసలు కారణం లేకపోలేదు. మాల్ మార్కెట్ కమిటీ అటు దేవరకొండ నియోజకవర్గంలోనూ ఇటు మునుగోడు నియోజకవర్గాల పరిధిలో ఉండటమే. మునుగోడు నియోజకవర్గలోని మర్రిగూడ, నాంపల్లి మండలాలు, అలాగే దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం మాల్ మార్కెట్ పరిధిలోకి రావడమే అసలు వివాదానికి తెరలేచింది.
కొత్తవాదనకు తెరలేపిన కూసుకుంట్ల….
సాధారణంగా ఇలాంటి పంచాయితీలు రాకుండా ఉండేందుకు మార్కెట్ కమిటీ పదవిని రోటేషన్ పద్ధతిలో ఒక్కో మండలానికి ఒక్కోసారి కేటాయిస్తారు. కిందటిసారి మునుగోడు మాజీ ఎమ్మెల్యే అనుచర వర్గానికి రొటేషన్ పద్ధతిలో పదవి దక్కింది. అదే పద్ధతి ప్రకారం ఈ సారీ చింతపల్లి మండలానికి దక్కుతుందని ఎమ్మెల్యే రవీందర్ నాయక్ అనుకున్నారు. తన అనుచరులను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ ప్రభాకర్ రెడ్డి కొత్తవివాదానికి తెరలేపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందున, ఆ నియోజకవర్గంలో పార్టీని, క్యాడర్ను బలోపేతం చేసేందుకు తన అనుచరుడికే పదవి ఇవ్వాలనే వాదనను లేవనెత్తుతున్నారని జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం ప్రతిపక్ష పార్టీలకు త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఆయుధంగా మారనుంది. ఎన్నికల ముందు అధికార పార్టీకి చెందిన ఇద్దరు బలమైన నేతలు ఇలా పదవుల కోసం కొట్లాడుడేందని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారని తెలిసింది. అయితే చివరికి పదవుల పంచాయితీ మంత్రి జగదీశ్ రెడ్డికి చేరిందని సమాచారం. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఎమ్మెల్యే కావడంతో వీరి పంచాయితీని మంత్రి ఎలా పరిష్కరిస్తారో అని, ఇద్దరిట్లో ఎవరి తమ పంతాన్ని నిలబెట్టుకుంటారోననే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.











