తెలుగు సినీ నటుడు తనీష్ మెడకు మళ్లీ డ్రగ్స్ కేసు చుట్టుకుంది. కర్ణాటకలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలోనూ తనీష్ ను ఈ కేసులో అధికారులు విచారించారు. ఇప్పుడు బెంగళూరు పోలీసులు తనీష్ కు నోటీసులు జారీ చేశారు. ఈరోజు బెంగళూరు లో జరిగే విచారణకు హాజరు కావలసిందిగా తనీష్ కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో ఓ నిర్మాత, ఓ పారిశ్రామిక వేత్త ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం ఐదుగురికి ఈ నోటీసులు జారీ చేశారు.
2017లో ఈ కేసలులో పలువురు సినీ ప్రముఖులను విచారించారు. వారిలో తనీష్ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. ఇటీవల ఈ డ్రగ్స్ కేసును విచారిస్తున్న పోలీసులకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇద్దరు విదేశీయులను ఈ కేసులో అరెస్టు చేసి విచారించారు. వారు అందించిన సమాచారం మేరకు మస్తాన్, విక్కీ మల్రోత్రా పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిని విచారించినప్పుడు నిర్మాత మస్తాన్ గౌడ్ పేరు తెలిసింది. ఆయన తన ఆఫీసులో ఇచ్చే పార్టీలకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారని, అందులో తనీష్ కూడా ఉన్నాడని పోలీసుల దగ్గర సమాచారం ఉంది.
ఆ మేరకు అతనికి నోటీసులు జారీ చేశారు. అయితే తనీష్ ఈ విచారణకు హాజరవుతున్నాడా? లేడా అన్నది తేలాల్సి ఉంది. ఈ కేసులో మళ్లీ తెలుగు నటుడి పేరు వెలుగులోకి రావడంతో చిత్ర పరిశ్రమలోకలకలం రేగుతోంది. సద్దుమణిగిందనుకున్న డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చేసరికి ఇప్పటికే ఇలాంటి వాటితో సంబంధం ఉన్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. తనీష్ విచారణ తర్వాత మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
నా మీద దుష్ప్రచారం ఆపండి: తనీష్
డ్రగ్స్ కేసులో తనపై జరుగుతున్న దుష్రచారాన్ని ఆపండి అంటున్నారు హీరో తనీష్. కనీసం తనను సంప్రదించకుండా ఏదోఒకటి రాసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ కేసులో నోటీసులు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం నా కుటుంబాన్నితీవ్రంగా బాధించింది. బెంగళూరు నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట నిజం. నాకు కూడా నోటీసు వచ్చింది. కానీ నాకు వచ్చిన నోటీసు అర్థం తెలుసుకోకుండా కొన్ని మీడియాలు ప్రచారం చేస్తున్నాయి.
అసలు బెంగళూరు నిర్మాతతో రెండేళ్లుగా ఎలాంటి సంప్రదింపులు నాకు లేవు.
ఈ కేసులో నాకు వచ్చిన నోటీసుకు కారణం వేరు. `ఫలానా వివరం మీకు తెలుసా.. తెలిస్తే చెప్పండి` అని మాత్రమే నన్ను ఆ నోటీసులో అడిగారు. నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యానని నోటీసులో లేదు. బెంగళూరు నిర్మాత నాతో సినిమా చేస్తానంటూ గతంలో సంప్రదింపులు జరిపారు. ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. రెండేళ్లుగా ఆయనతో టచ్ లో లేను. అసత్యాలు ప్రచారం చేయొద్దు’ అని తనీష్ మీడియాను కోరారు.
Must Read ;- కొత్త బాయ్ ఫ్రెండ్ తో డ్రగ్స్ కేస్ బ్యూటీ











