వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటికి మంచి పేరు వుంది. కథలను ఆయన ఎంచుకునే తీరు .. కథనాన్ని నడిపించే విధానం .. పాత్రలను మలిచే పద్ధతి కొత్తగా ఉంటాయి. కథాకథనాలపై ఎంతో కసరత్తు చేస్తేనే తప్ప ఆయన రంగంలోకి దిగడు. తాను అనుకున్నట్టుగా స్క్రిప్ట్ సంతృప్తికరంగా వస్తేనే ఆయన సెట్స్ పైకి వెళతాడు. ఈ కారణంగానే సినిమాకి .. సినిమాకి మధ్య ఆయన ఎక్కువ సమయం తీసుకుంటూ వుంటాడు. ‘ఐతే’ అనే తొలి చిత్రంతోనే దర్శకుడిగా తాను వెళ్లే దారి విభిన్నంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. ఆ తరువాత చేసిన ‘అనుకోకుండా ఒక రోజు’ .. ‘ఒక్కడున్నాడు’ .. ‘సాహసం’ సినిమాలు, కొత్తదనానికి ఆయనిచ్చే ప్రాధాన్యతకు ప్రతీకగా కనిపిస్తాయి.
‘మనమంతా’ సినిమా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది. సున్నితమైన ఎమోషన్స్ ను టచ్ చేస్తూ, కథను అన్నివైపుల నుంచి ఎలా నడుపుకుంటూ వస్తాడనడానికి ఈ సినిమా నిదర్శనంగా కనిపిస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా ఆ కథలో ఒక పాత్రగా మారిపోతాడు. అంత సహజంగా .. వాస్తవానికి దగ్గరగా ఆయన కథలు ఉంటాయి. ఇక మొదటి నుంచి కూడా ఆయన ఎప్పటికప్పుడు జోనర్లను కూడా మార్చేస్తూ వచ్చాడు. ఒకసారి లవ్ కి .. ఒకసారి ఎమోషన్ కి .. మరో సారి థిల్లర్ కి .. ఇంకోసారి యాక్షన్ కి పెద్దపీట వేస్తూ తన ప్రత్యేకతను చాటుతూ వస్తున్నాడు. అలాంటి చంద్రశేఖర్ యేలేటి ఈ సారి ‘చెక్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
ఇంతవరకూ చంద్రశేఖర్ యేలేటి టచ్ చేయని రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. మంచి క్రేజ్ వున్న నితిన్ వంటి యువ కథానాయకుడితో సినిమా చేస్తుండటం మరో విశేషం. విలన్ ఆటకట్టించడం కోసం అతనితో హీరో ఆడే మైండ్ గేమ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం, ‘చెక్’ అనే టైటిల్ ను బట్టి అర్థం అవుతోంది. ఈ సినిమా నుంచి ‘మోషన్ పోస్టర్’ రిలీజ్ చేసిన దగ్గర నుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి. చాలాకాలం నుంచి మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న చంద్రశేఖర్ యేలేటికి ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరుతుందని అంటున్నారు. వరుస పరాజయాలకు ‘చెక్’ పెట్టేస్తాడని కూడా చెబుతున్నారు.
కథ విషయంలో చాలా కసరత్తు చేసే నితిన్, ఈ కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దీనిని బట్టి కథలో విషయం ఉందనేది అర్థమవుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ .. ప్రియా వారియర్ నటిస్తున్నారు. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, కీరవాణి అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హిట్ కొడితే అందరికంటే ఎక్కువగా ప్రియా వారియర్ కెరియర్ కి హెల్ప్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.











