కోర్టు రూమ్ డ్రామాస్ కు ఎప్పుడూ మంచి వెయిట్ ఉంటుంది. ఆసక్తికరమైన కథాకథనాలు, ఆకట్టుకొనే సన్నివేశాలు .. నటీనటుల పెర్ఫార్మెన్స్ మెచ్చుకో దగ్గ రీతిలో ఉంటే.. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా పేలతాయి. గతంలో ఈ తరహా సినిమాలు టాలీవుడ్ లో చాలా వచ్చాయి. అందులో కొన్ని బాగా పే చేశాయి. ఈ తరం ప్రేక్షకుల్ని మెప్పించడానికి కొన్ని సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. కోర్ట్ లో ఇరు పక్షాల లాయర్ల వాదోపవాదాలు.. వాయిదాలు .. తీర్పుల నేపథ్యంలో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ఈతరహా చిత్రాల్లో నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తాప్సీ కథానాయికగా, అమితాబ్ లాయర్ గానూ నటించిన ఈ సినిమా ఆ తర్వాత తమిళంలో నేర్కొండ పార్వై గా రీమేక్ అయింది. అజిత్ , శ్రద్ధాశ్రీనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి హెచ్.వినోద్ దర్శకుడు. నగరంలో పలుకుబడి కలిగిన వారి కొడుకులకు, కొందరు అమ్మాయిలకు మధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్ .. కాంప్లికేటెడ్ అవుతుంది. అది కోర్ట్ వరకూ వస్తుంది. వారి కేసును ఒక యంగ్ లాయర్ ఆ కేస్ టేకప్ చేసి . ఆ అమ్మాయిలకు ఎలా న్యాయం చేశాడు అన్నదే కథ. అజిత్ పాత్ర కోసం చేసిన మార్పుల్నే ‘వకీల్ సాబ్’ విషయంలోనూ చేశారు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.
అల్లరి నరేశ్ ‘నాంది’
ఇప్పటివరకూ కామెడీ సినిమాలతోనే కాలక్షేపం చేసిన నరేశ్ .. తన స్టైల్ మార్చుకుంటూ.. సరికొత్త మేకోవర్ తో రాబోతున్న క్రైమ్ డ్రామా ‘నాంది’. అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కొని జైలు పాలవుతాడు ఓ యువకుడు. అతడు నిర్దోషి అని తెలుసుకొన్న ఒక క్రిమినల్ లాయర్ .. ఈ కేసు టేకప్ చేస్తుంది. చివరికి అతడు ఈ కేసు నుంచి ఎలా బైట పడతాడు అన్నదే మిగతా కథ. ఈ సినిమా కోసం అల్లరి నరేశ్ కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించాడు. క్రిమినల్ లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీశ్ వేగేశ్న నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాతో .. అల్లరి నరేశ్ .. కొత్త దనానికి నాంది పలుకుతాడని చెబుతున్నారు.
రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’
కొద్ది రోజుల క్రితం ప్రణయ్ హత్యకేసు ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రణయ్ అనే యువకుడు అమృత అనే అమ్మాయిని ప్రేమించిన పాపానికి .. ఆ అమ్మాయి తండ్రి మారుతీరావు అతడ్ని హత్యచేయించిన దారుణాన్ని ఎవరూ మరిచిపోలేరు. పరువు హత్యగా తేలిన ఈ కేసు లో మారుతీరావు ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మారుతీరావు బైలు మీద బైటికొచ్చి.. ఒక చోట అనుమానాస్పద రీతిలో ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ సంఘటనను రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో సినిమాగా తీస్తున్న సంగతి తెలిసిందే. మారుతీరావుగా శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మారుతీరావు కోణంలో ఈ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కూడా కోర్ట్ రూమ్ డ్రామా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.
సత్యదేవ్ ‘తిమ్మరుసు’
టాలీవుడ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే అతడి టాలెంట్ కు తగ్గట్టుగానే .. అతడి తదుపరి చిత్రాలు తెరకెక్కబోతున్నాయి. అందులో ఒకటి ‘తిమ్మరుసు’. అసైన్ మెంట్ వాలి ట్యాగ్ లైన్ తో రీసెంట్ గా అనౌన్స్ మెంట్ జరుపుకున్న ఈ సినిమా కు శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకీ న్యాయస్థానానికి ప్రధానమైన లింక్ ఉండనుంది. అనౌన్స్ మెంట్ లుక్ లో న్యాయదేవత తన చేతిలో ఉన్న తక్కెడను సమానంగా పైకెత్తి పట్టుకోవడం ఆకట్టుకుంటోంది. మరి వీటిలో ఏ ఏ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారో చూడాలి.