డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అవుతన్న తొలి తెలుగు భారీ బడ్జెట్ సినిమాగా ‘వి’ సినిమాకి ఇప్పటికే యమ క్రేజ్ వచ్చేసింది. కింద క్లాసుల్లో పరిస్థితి ఎలా ఉందో తెలీదు కానీ ఏ క్లాస్ ఆడియెన్స్ మాత్రం వి రిలీజ్ కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో వి రిలీజ్ అవుతుందని అఫీషియల్ ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
వి అంటే ఏంటో అర్థం చెప్పకుండా అస్సలు సినిమా కథ ఏంటో కూడా ఎవ్వరూ గెస్ట్ చేసే వీలు లేకుండా చాలా రహస్యంగా ఈ సినిమాను తీశారు దిల్ రాజు అండ్ టీమ్. అయితే ట్రైలర్లో ఇదే గోప్యత పాటిస్తే బాగుండేది కానీ మీకు వైలన్స్ సినిమాలు ఇష్టమా అనే డైలాగ్ ను ట్రైలర్ లో పెట్టి వి ఫర్ వైలన్స్ అనే మీనింగ్ చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా హీరోగా నటిస్తున్నాడు.
అయితే నాని మీదనే ఫోకస్ పెట్టి వి ప్రమోషన్స్ సాగుతన్నాయి. ఇక ట్రైలర్ లో కూడా అదే పరిస్థితి ఉంది. సుధీర్ బాబు కంటే నాని షాట్స్ ఎక్కువ పడేలా కట్ చేశారు ట్రైలర్. అయితే సుధీర్ బాబు కనిపించిన కొన్ని షాట్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా అనిపించాయి. సుధీర్ బాబు బాడీకి తాను యాక్షన్ సీన్స్ చేస్తే నాచురల్ గా అనిపిస్తోంది. వి లో సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉండబోతున్నట్లుగా అనిపిస్తోంది.
ఇక ఇప్పటి వరకు ఫ్యామిలీ హీరో, లవ్లీ ఇమేజ్ తెచ్చుకున్న నాని వి సినిమాలో గన్స్ పట్టుకుని ఫైట్స్ చేయడం కొంచెం కొత్తగా అనిపిస్తోంది. గాల్లో లేచి కొట్టడం, రెండు చేతులతో గన్స్ ఫైర్ చేయడం వంటి స్టంట్స్ నాని చేస్తే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తోంది. అలానే క్లోజప్ షాట్స్ లో డైలాగ్స్ చెబుతూ నాని తనలో విలనిజాన్ని పలికించడానికి ప్రయత్నించాడు. కానీ అది అంతగా కుదర్లేదు. ట్రైలర్ వరకు నాని పై వేసిన షాట్స్, డైలాగ్స్ కొత్తగా అనిపించినా ఇలాంటి తిప్పలు నానికి అవసరమా అని అనిపించక తప్పదు.
ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ అంటూ ప్రచారం చేసిన వి టీమ్ ఇప్పుడు ట్రైలర్ లో మాత్రం ముగ్గురునే చూపించారు. నాని, సుధీర్ బాబు, నివేధ థామస్ విజువల్స్ మాత్రమే కనిపించాయి. ఈ ట్రైలర్ లో హీరోయిన్ అదితి రావ్ హైదర్రీ మిస్ అయింది. అలానే ఈ సినిమాలో నాని పెద్దగా కనిపించడు అని వస్తున్న వార్తల్ని కూడా సమర్ధించే రీతిన ట్రైలర్ ఉంది. కామన్ ఆడియెన్స్ అయితే హిందీ ధూమ్ సినిమాను తెలుగులో ఫ్రీమేక్ చేశారని సింపుల్ గా ఓ మాటతో ఈ ట్రైలర్ కి రివ్యూ ఇచ్చేస్తారు.