మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కారల్‌మార్క్స్ అన్న మాటలు ఆయన ఏ సందర్భంలో అన్నాడో తెలియదుగానీ.. ఆ మాటలనే ప్రస్తుత రాజకీయాలకు ఆపాదించుకుంటే.. కొన్ని రాజకీయ పార్టీలు చేపట్టే ప్రతి పనీ వెనుకాల ఓట్ల రాజకీయమే దాగుంటుందని అనుకోవాల్సి ఉంటుంది. ఈ మాటలు ఎందుకనాల్సి వస్తుందంటే.. రెండేళ్ల క్రితం జరిగిన గ్రూప్-4 పరీక్ష ఫలితాలను ఆగమేఘాల మీద, చడీచప్పుడు కాకుండా రెండు రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశంపైన పలు రాజకీయపార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఎమ్మెఎల్సీ ఎన్నికల కోసమేనా?
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడీ నడుస్తోంది. వచ్చే ఏడాదిలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రాబోతున్నాయి. దీనికోసం ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను పదునుపెడుతున్నాయి. గతంలో ఈ రెండు స్థానాల్లో పోటీచేసిన టిఆర్ఎస్ పార్టీ కేవలం నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలోనే గెలుపొందింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో బిజెపి అభ్యర్థి రాంచందర్‌రావు చేతిలో తెరాస అభ్యర్థి దేవీప్రసాద్ ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ రెండు స్థానాలపై తెరాస దృష్టి సారించింది. ఎలాగైనా ఈ రెండు చోట్ల గులాబీ జెండా ఎగురవేయాలని గులాబీ పార్టీ భావిస్తుంది. అయితే నల్లగొండ-వరంగల్-ఖమ్మం నుంచి జనసమితి పార్టీ అధ్యక్షులు కోదండరామ్ పోటీచేస్తుండగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నుంచి మళ్లీ రాంచందర్‌రావే పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీకి కోదండరామ్ గట్టి పోటీనిస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అలాగే బిజెపి కూడా. దీనికితోడూ ప్రభుత్వ విధానాలపట్ల పట్టభద్రులు అసంతృప్తితో ఉన్నారు. ఇదే అంశాన్ని అటు జనసమితి, ఇటు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఓట్ల రూపంలో క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.
ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును ప్రతిపక్ష పార్టీలు ఎండగడుతున్నాయి. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు, పట్టభద్రులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. మొన్న తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో జరిపిన సమావేశంలో సిఎం కెసిఆర్ కూడా ఇదే అంశంపై నాయకులకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. పట్టభద్రులు తెరాసకు వ్యతిరేకమనే భావనను తిప్పికోట్టాలని పార్టీ నాయకులకు కెసిఆర్ దిశానిర్ధేశం చేశారు. ఇలాంటి నేపథ్యంలో రెండు రోజుల క్రితం గ్రూప్-4 ఫలితాలను విడుదల చేయడం పలు చర్చలకు దారితీస్తోంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లను కొల్లగొట్టడం కోసమే పరీక్ష రాసి రెండు సంవత్సరాల తరువాత ఫలితాలను విడుదల చేశారనే ఆరోపణలను లేవనెత్తుతున్నారు. ఇదీ కేవలం ఎన్నికల స్ట్రాటజీగానే చూడాలని పేర్కొంటున్నారు.
ఎన్నికల స్ట్రాటజీనెనా?..
2018లో దాదాపు 1,595 ఉద్యోగాల కోసం జూన్‌లో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల అయింది. వాటికి సంబంధించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ తాజాగా ఈనెల 6న మంగళవారం విడుదల చేసింది. అయితే ఎప్పుడో రాసిన పరీక్షలకు దాదాపు రెండు సంవత్సరాల నాలుగు నెలల తరువాత ఫలితాలను విడుదల చేయడం ఎన్నికల లబ్దిలో భాగంగానే చూడాలని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇనాళ్ల నుంచి గుర్తుకు రాని ఫలితాల అంశం ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకొచ్చిందో పట్టభద్రులే అర్ధం చేసుకోవాలని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పట్టభద్రులను ఫలితాల పేరుతో దువ్వే ప్రయత్నం అధికారపార్టీ చేస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఇలా హడావుడీగా గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసి నిరుద్యోగులకు, పట్టభద్రులకు తాము వ్యతిరేకం కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తెరాస చేస్తుందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదీ కేవలం ఎన్నికల స్ట్రాటజీగానే చూడాలని విమర్శలు చేస్తున్నారు.











