తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు..ఈ ఇద్దరు నేతలు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉద్ధండులు. వైసీపీ హయాంలో ఒకరు స్పీకర్‌గా, మరొకరు మంత్రిగా వ్యవహరించారు. ఐతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హవాలో వైసీపీ హేమాహేమీలంతా ఓటమి బాట పట్టారు. ఈ ఇద్దరు దిగ్గడ నేతలు సైతం ఓడిపోయారు. ఐతే వైసీపీ ఓటమి తర్వాత ఈ ఇద్దరు నేతలు సైలెంట్ అయ్యారు. పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మీటింగ్‌లకు సైతం హాజరు కావడం లేదు.
ఈ ఇద్దరు నేతల వ్యవహారశైలి ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి అర్థం కావడం లేదు. శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి పదవి ధర్మాన ప్రసాదరావుకు ఇస్తామన్నప్పటికీ..ఆయన నుంచి సరైన స్పందన రాలేదని చర్చ జరుగుతోంది. ఇక తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా నియమించినప్పటికీ…ఆయన కూడా సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ఇటీవల మాజీ మంత్రి కురసాల కన్నబాబును వైసీపీ హైకమాండ్ నియమించిన విషయం తెలిసిందే. కురసాల కన్నబాబు తొలిసారి ఆ హోదాలో శ్రీకాకుళం వచ్చి మీటింగ్ పెడితే ఈ ఇద్దరు నాయకులు డుమ్మా కొట్టారు.
ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం ఇద్దరు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు. అంతేకాదు అపార రాజకీయ అనుభవం ఈ ఇద్దరు నేతల సొంతం. దీంతో ఈ ఇద్దరి విషయంలో పార్టీ వేచి చూసే ధోరణిలో ఉందని సమాచారం. ఈ ఇద్దరు ఇతర పార్టీల్లోకి వెళ్తారని ప్రచారం జరిగినా..ఆ పార్టీల నుంచి సానుకూలత రాలేదని తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు మరో 4 ఏళ్లకుపైగా సమయం ఉందని, కాబట్టి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చనే ఆలోచనలో ఈ ఇద్దరు నేతలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
జిల్లా స్థాయిలో పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తే ఈ ఇద్దరు హాజరుకాకపోవడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో తమకంటే జూనియర్ వ్యక్తిని ఇన్‌ఛార్జిగా నియమించడంపై ఆగ్రహంతో ఉన్నారా అనే అనుమానం కూడా వస్తోంది. ఐతే కన్నబాబు ఎలాంటి భేషజాలకు పోకుండా ఈ ఇద్దరు నేతల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారని పార్టీ నేతలు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ జిల్లాలో ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి రిపేర్లు చేయాల్సి ఉంది. ఐతే కన్నబాబు ఉత్సాహంగా పని చేస్తే ఫలితం ఉంటుందని స్థానిక నేతలు చెప్తున్నారు. కన్నబాబుకు హైకమాండ్ పూర్తి స్థాయిలో అండగా ఉందని అంటున్నారు.