టీడీపీ నుంచి వైసీపీలో చేరి దుర్మార్గపు రాజకీయాలకు తెగబడ్డ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గడ్డు కాలం మొదలు కాబోతోంది. వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వల్లభనేని వంశీ వైసీపీ హాయాంలో జగన్ మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయారు. ఆయన చేయని నేరం అంటూ లేదని నియోజకవర్గ ప్రజలే అంటుంటారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేశారు.
కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ దాడిలో వల్లభనేని వంశీ నేరుగా పాల్గొనలేదు. కానీ, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. తన కనుసన్నల్లోనే ఇదంతా చేయించారు. వంశీ ఎగతోయడంతోనే వైసీపీ కార్యకర్తలు, అల్లరి మూకలు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, రెండు నెలల ముందు వరకూ వైసీపీనే అధికారంలో ఉండడంతో ఆ కేసును మరుగున పడేశారు. సొంత పార్టీనే కాబట్టి, ఘటన జరిగిన సమయంలో కూడా వంశీ సహా ఆ పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఏ కేసులు నమోదు చేయలేదు. పైగా టీడీపీ శ్రేణులపై కేసులు మోపారు. వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన గన్నవరం పోలీసులు ఈ కేసులో వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ కార్యాలయంపై దాడికి కారకుల ఫైలును బయటికి తీసి.. చర్యలు చేపట్టాలని పోలీసులకు ప్రభుత్వం నుంచి ఆదేశాయి అందాయి. అలా పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు. కానీ, వంశీ సహా ఇంకొందరు కీలక నిందితుల్ని వదిలేశారని టీడీపీ శ్రేణులు నిరసనలు చేశారు.
మరోవైపు, వల్లభనేని వంశీ టీడీపీ అధినేతపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో అధిష్ఠానం కూడా వల్లభనేనిని సీరియస్ గా తీసుకుంది. పైగా నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి టీడీపీ శ్రేణుల నుంచి బాగా పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు ఈ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ చేశారు. వల్లభనేని వంశీ కుటుంబం హైదరాబాద్‌లోనే నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు రెడీ అయ్యారు. గురువారం మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.











