జగన్ రెడ్డి పార్టీకి కుప్పం నియోజకవర్గంలో కనీసం తల ఎత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైనాట్ కుప్పం అని కాలర్ ఎగరేసుకొని అతి విశ్వాసం ప్రదర్శించిన జగన్ కు తగిన శాస్తి జరుగుతోంది. కుప్పంలో చంద్రబాబుకు ప్రత్యర్థిగా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పోటీ చేసి దారుణ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అనుచరులుగా ఉన్న పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో భరత్ తో పాటు జగన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయింది. ఇంత కంటే పరువుతక్కువ పని మరోటి ఉండదంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు మొదలైయ్యాయి.
కుప్పంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ అనుచరులైన 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు బుధవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ శ్రేణులను బుజ్జగించేందుకు భరత్ రామకుప్పం వెళ్లగా.. ఆయన్ను కుప్పం ప్రజలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. భరత్ గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భరత్‌ను అక్కడి నుంచి పంపించారు.
జగన్ మోహన్ రెడ్డి పాలనలో కుప్పంలో దారుణ పరిస్థితి ఉండేది. టీడీపీ మద్దతుదారులను ప్రభుత్వం అస్సలు సహించేది కాదు. గత ఐదేళ్ల పాటు టీడీపీ కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు వారిపైనే అక్రమంగా కేసులు పెట్టారు. కొన్నిసార్లు చంద్రబాబు టూర్ ను కూడా అడ్డుకున్నారు. ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే, గత ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఘోర ఓటమి చూడడంతో.. కుప్పంలో కూడా పరిస్థితులు తారుమారు అయ్యాయి. నిన్న వైసీపీ కార్యాలయాన్ని కూడా మూసేసి.. ఓ రెస్టారెంట్ మార్చిన సంగతి తెలిసిందే.
ఇటీవల చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక యువత, చిన్న వ్యాపారులకు ఆర్ధిక, వస్తుసాయం అందించారు.. ఈ పర్యటనతో కుప్పంలో టీడీపీ శ్రేణులలో నూతన ఉత్తేజం కనిపించింది.. ఆమె పర్యటనలో వందల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు..
మరోవైపు, ఎన్నికల్లో ఓడిపోయాక భరత్ కుప్పానికి దూరంగానే ఉన్నారు. ముఖ్యంగా గత నెల రోజులుగా పత్తా లేకుండా ఉన్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా.. ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో అనేక అరాచకాలు సృష్టించారు. కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు పర్యటనలను సైతం అడ్డుకొని నానా బీభత్సం రేపేవారు. ఆ గొడవల్లో పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు పెట్టి ఎంతో మందిని వేధించారు. పైగా వైసీపీ నేతలతో చంద్రబాబును పరుషపదజాలంతో దూషింపజేశారు. అలాంటి భరత్ కుప్పం నియోజకవర్గంలో రావొద్దని, ఆయన లేకపోతేనే కుప్పం ప్రశాంతంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అందుకే వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ముఖ్యనేతలు టీడీపీలో చేరారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన భరత్ ను అంతా కలిసి తరిమివేశారు.











