సర్వేలను బాగా విశ్వసిస్తూ పార్టీలో నమ్మిన వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపిస్తున్నారు. తాజాగా తనను నమ్మి వచ్చిన మరో నేతకు అన్యాయం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. జగన్ జోరు బాగా కొనసాగుతున్న సమయంలో ప్రయోజనాలు ఆశించి వైసీపీ వైపు మళ్లిన టీడీపీ అసంతృప్త నేత వల్లభనేని వంశీ మోహన్.. జగన్ తీరుతో నొచ్చుకుంటున్నట్లు సమాచారం. గన్నవరం నియోజకవర్గంలో 2014 నుంచి టీడీపీ నుంచి గెలుస్తూ వస్తున్న వల్లభనేని వంశీ.. 2020లో వైసీపీ మద్దతుదారుగా మారారు. జగన్ అండదండలతో విపక్ష టీడీపీపై దుమ్మెత్తిపోయడమే అజెండాగా పెట్టుకొని తీవ్రమైన వ్యాఖ్యలకు తెగబడ్డారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణలు చేసి వివాదాల్లో సైతం చిక్కుకున్నారు. ఇదంతా జగన్ ను మెప్పించడానికే చేసినప్పటికీ.. ఇప్పుడు ఆయనే వంశీకి ఝలక్ ఇస్తుండడం చర్చనీయాంశం అయింది.
ప్రశాంత్ కిషోర్ సర్వేతో టీడీపీ అసంతృప్త నేత వల్లభనేని వంశీ సొంత నియోజకవర్గం గన్నవరంలో సీన్ రివర్స్ అవ్వబోతున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ గుర్తించారట. అందుకని.. వల్లభనేనికి ఈసారి టికెట్ ఇస్తే అక్కడ వైసీపీ ఓటమి తప్పదని భావించి ఆయనకు నిరాకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. పీకే సర్వేతోపాటు జగన్ ఇంటెలిజెన్స్ సర్వే కూడా వైసీపీ తరపున పోటీ చేస్తే వల్లభనేని ఓడిపోతారని తేల్చి చెప్పిందని సమాచారం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే వల్లభనేనికి టికెట్ నిరాకరిస్తే.. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం తప్పదని భావిస్తున్నారట.
వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీ పంచన చేరడం అనేది.. అప్పటికే గన్నవరం వైసీపీ నేతలుగా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంక్రటావుకు నచ్చలేదు. వారికి పొసగకపోవడంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. దుట్టా రామచంద్రరావు వెళ్లిపోతున్నప్పటికీ జగనే ఆపారని అంటారు. ఈ ప్రకారం.. ఈసారి టికెట్ దుట్టా రామచంద్రరావుకే దక్కుతుందని టాక్. టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు బరిలో ఉండే అవకాశం ఉంది. జగన్ హ్యాండ్ ఇచ్చిన పక్షంలో గన్నవరం నుంచి వల్లభనేని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని అంటున్నారు. ఎందుకంటే వల్లభనేని టీడీపీకి వ్యతిరేకంగా చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటిది టీడీపీలోనే ఉండిపోయి పోటీ చేసే పరిస్థితి అస్సలు ఉండదు. అటు జనసేనలోనూ చేరే అవకాశం లేదు కాబట్టి, ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తారని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. తన సర్వేలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ సన్నిహితులను సైతం పక్కన పెడుతున్నారు. గతంలో ఎన్నోఏళ్ల నుంచి పార్టీలో సహకరించిన వారిని కూడా జగన్ పట్టించుకోకపోతుండడంతో నేతల్లో అసహనం బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని ప్రచారం ఉండడంతో ఎవరికి వారు.. జగన్ కు రెబల్ గా మారడానికి రెడీగా ఉన్నారు. అధికారిక సమాచారం వెలువడగానే జగన్‌కు తుపాను రూపంలో నేతల నుంచి అసమ్మతి ఎదురుకానున్నట్లు తెలుస్తోంది.











