ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఓడిపోవడం ఖాయమని జగన్ సొంత సర్వే సంస్థలే చెబుతున్నాయి. వీటితో పాటు ప్రముఖ అన్ని పొలిటికల్ సర్వే సంస్థలు వైసీపీకి గడ్డు కాలమే అని గంట బజాయించి చెబుతున్నాయి. కానీ, ఓ పేరున్న జాతీయ మీడియా సంస్థ మాత్రం అవన్నీ తప్పంటూ.. ఓ కొత్త సర్వే ఫలితాలను విడుదల చేసింది. టైమ్స్ నౌ అనే జాతీయ మీడియా సంస్థ ఏపీలో వివిధ పార్టీలకు వచ్చే ఫలితాలను అంచనా వేస్తూ ఓ రిపోర్టును విడుదల చేసింది. అందులో సాధారణ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, ఆ పార్టీకి 24 నుంచి 25 లోక్ సభ స్థానాలు వస్తాయని చెప్పింది. ఈటీజీతో కలిసి టైమ్స్ నౌ ఈ ఫలితాలను వెల్లడించింది. ఇక దీన్ని జగన్ మీడియా విపరీతంగా ప్రచారం చేసుకుంటుంది.
గత ఐదేళ్లలో సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనతో వైసీపీకి ప్రజాదరణ మరింతగా పెరిగిందని సదరు సంస్థ విశ్లేషించింది. అందుకే ఆ పార్టీ 22 లోక్‌సభ స్థానాల నుంచి 25 లోక్‌సభ స్థానాల్లోనూ క్వీన్ స్వీప్ చేయబోతుందని.. తిరుగులేని విజయం సాధిస్తుందంటూ విశ్లేషించింది. అయితే, ఈ టైమ్స్ గ్రూపు గత రిపోర్టులు పరిశీలిస్తే.. ప్రజలు వాటిపై అంత విశ్వాసం ఉంచే పరిస్థితి లేదు. జగన్ అధికారంలోకి వచ్చి నాటి నుంచి టైమ్స్ గ్రూపునకు ప్రభుత్వం ప్రకటనలో లెక్కలేనన్ని ఇచ్చారు. టైమ్స్ నై ఛానెల్‌లో, టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్‌కు రూ.కోట్ల కొద్దీ విలువైన ప్రకటనలు ఇచ్చారు. అందుకు జీవోలు కూడా ఆ మధ్య పబ్లిక్ డొమైన్ లో పెట్టడంతో అది వివాదాస్పదం కూడా అయింది.
‘రాష్ట్రంలో జరుగుతున్న మేలును జాతీయ వ్యాప్తంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా..’ అంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. ఆ సంగతి అటుంచితే టైమ్స్ గ్రూపులోని మీడియా సంస్థలు ఎక్కువగా కమర్షియల్ తరహాలో నడుపుతుంటారు. ఉదాహరణకి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ విషయంలోనే వార్తల కన్నా ఎక్కువగా యాడ్స్ ఉంటుంటాయి. ఫ్రంట్ పేజీలు రెండు మూడు ఫుల్ పేజీ యాడ్స్ కే కేటాయిస్తుంటారు. లోపల ప్రతి కుడి పేజీలో ప్రకటనల డామినేషనే అధికంగా ఉంటుంది. ఇక సిటీ ఎడిషన్ లో అయితే.. అందులో కంటెంట్ కన్నా అధికంగా ప్రకటనలే ఉంటాయి. దేశ వ్యాప్తంగా టైమ్స్ గ్రూపు సంస్థల్లో ఇలాంటి ధోరణే ఉంటుంది. తమకు లాభం చేకూర్చిన వారిని పైకెత్తేయడంలో సదరు సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఈ తాజా సర్వే కూడా ఆ కోవలోకే వస్తుంది. అసలు టైమ్స్ నౌ చెప్పిందే నిజమనుకుంటే.. జగన్ ఇంత రిస్క్ చేసి ఎమ్మెల్యేల మార్పులు ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. దాదాపు 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, కొంత మంది ఎంపీలకి నో టికెట్ అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా మార్పులు కూడా జరుగుతున్నాయి.
ఇక తెలంగాణలో ఇదే సంస్థ చెప్పిన అంచనాలు కాస్త ప్రజల అంచనాలకు, రాజకీయ పరిస్థితులకు తగ్గట్లే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు టైమ్స్ నౌ, ఈటీజీ సర్వే సంస్థ వెల్లడించగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 8 నుంచి 10 స్థానాలు వస్తాయని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 5 స్థానాలను, బీజేపీ 3 నుంచి 5 స్థానాలను, ఇతరులు ఒక స్థానాన్ని గెల్చుకుంటాయని తేల్చింది. ఏపీలో మాత్రం ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఒపీనియన్ పోల్ ఫలితాలు ఉండడంతో అది కచ్చితంగా వైసీపీకి సదరు జాతీయ సంస్థకి మధ్య జరిగిన లోపాయికారి ఒప్పంద ఫలితమే అని ప్రజలు భావిస్తున్నారు.