రోజులు గడుస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం పెరుగుతూ ఉంది. వైఎస్ఆర్ సీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వైదొలగడం మరింత ఎక్కువ అవుతోంది. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, గాజువాక వైసీపీ ఇంఛార్జి దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా క్రమంగా వైసీపీ నుంచి ఒక్కో వికెట్ పడిపోతూ వస్తోంది. తాజాగా మాజీ మంత్రి మరడాని రంగారావు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో గురువారం జాతీయ టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, రంగారావుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన మాజీ మంత్రి మరడాని రంగారావును చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. రంగారావు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.
మరడాని రంగారవు మాత్రమే కాకుండా.. గురువారం కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన ఎంతో మంది వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక్క కదిరి నియోజకవర్గం నుంచే దాదాపు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారంటే.. జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కదిరిలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని వారు మీడియాకు చెప్పారు. తమ పక్క నియోజకవర్గం, జగన్ సొంత ఊరైన పులివెందులలో కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా ప్రజా వ్యతిరేకత ఉందని అన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పులివెందులలో జగన్ గెలవడం కూడా కష్టమే అన్నట్లుగా టీడీపీలో చేరిన కార్యకర్తలు చెప్పారు.
అటు ఏలూరు నియోజకవర్గానికి చెందిన ఆటో యూనియన్ లీడర్ నగరబోయిన లీలా కృష్ణ సహా వంద మందికి పైగా అనుచరులు టీడీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో తాము నష్టపోయామని వారు వెల్లడించారు. పోలీస్ ఫైన్లు, పన్నులు, మద్యం రేట్లు, పెట్రో ధరల పెంపుతో తమపై ఎంతో భారం పడుతోందని.. వాటి వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని ఆటో యూనియన్ నేతలు చంద్రబాబు ముందు చెప్పుకున్నారు.
నియోజకవర్గంలో పై స్థాయి నేతలు సహా కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీపై తీవ్ర అసహనంతో ఉండడంతో జగన్ కు మున్ముందు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు క్షేత్ర స్థాయిలో నేతల బలం, కార్యకర్తల సహకారం లేకపోతే గెలవడం చాలా కష్టం. తెలంగాణలోనూ ఎంతో మంది ఎమ్మెల్యేలు అలాగే ఓడిపోయారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఎంత మంది ఎమ్మెల్యేలను మార్చినప్పటికీ కార్యకర్తల్లో ప్రభుత్వంపైనే అసమ్మతి ఉంది కాబట్టి, ఇక వైసీపీ గెలవడం అనేది కలే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.











