గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో వైసీపీ నేతలు చేసిన అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ జరిపింది. ఆడుదాం ఆంధ్రాలో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేశారని ఫిర్యాదు అందడంతో విజిలెన్స్ దర్యాప్తు చేసింది. అన్ని వివరాలతో నివేదికను సిద్ధం చేసింది.
గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంది. వైసీపీ కార్యకర్తలను ప్లేయర్లుగా తీసుకు వచ్చి వారికి డబ్బులు ఇచ్చారు. సరిగ్గా ఆడకపోయినప్పటికీ రివార్డుల పేరిట భారీగా దోచిపెట్టారు. ఈ కార్యక్రమం మొత్తం నాటి మంత్రి రోజా, అప్పట్లో శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కనుసన్నల్లో జరిగింది. కేవలం 47 రోజుల వ్యవధిలోనే కనీసం రూ. 120 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
క్రికెట్ కిట్ల కొనుగోలులో చేసిన ఖర్చు కన్నా ఎక్కువగా బిల్లులు పెట్టుకోవడం, నాసిరకం కిట్లు కొనుగోలు చేయడం సహా అందినకాడికి దోచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు విజిలెన్స్ విచారణలో అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి చేరనుంది. తర్వాత కేసుల నమోదు, అరెస్టులు ఉండనున్నాయి











