విజయవాడలో కాల్పుల ఘటన మరవక ముందే మరో ఘటన ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. తనను ప్రేమించడం లేదని నాగభూషణం అనే యువకుడు చిన్నారి అనే యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపాడు. ఈ ఘటనలో ప్రేమోన్మాది నాగభూషణం కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చిన్నారి అనే యువతి అక్కడికక్కడే చనిపోయింది. విజయవాడ గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అసలే జరిగింది
కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని కోవిడ్ సెంటర్‌లో నర్సుగా చేస్తోంది. ఆస్పత్రికి దగ్గరలోనే స్నేహితురాళ్లతో కలసి ఓ గదిలో అద్దెకు ఉంటోంది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన నాగభూషణం కొంత కాలంగా ప్రేమ పేరుతో చిన్నారి వెంట పడుతున్నాడు. అతని అరాచకాలు భరించలేక, కొంత కాలం కిందట యువతి గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు నాగభూషణానికి కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తుల్లో చిన్నారి వెంట పడనని రాసి ఇచ్చాడు. దీంతో చిన్నారి కేసు వెనక్కు తీసుకుంది. అప్పటి నుంచి చిన్నారిపై నాగభూషణం కక్ష పెంచుకున్నాడు.
వేటు వేసి కాటు వేశాడు
చిన్నారి తన ప్రేమను తిరస్కరించడంతోపాటు, కేసు కూడా నమోదు చేయడంతో నాగభూషణం ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను మట్టుపెట్టాలని పెట్రోల్ బాటిల్ తో తిరుగుతున్నాడని తెలుస్తోంది. సోమవారం రాత్రి 9గంటలకు కోవిడ్ కేంద్రంలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న చిన్నారితో ముందుగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆమె నాగభూషణంతో గొడవ పడటంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చిన్నారి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రంగా గాయపడ్డ నాగభూషణాన్ని ముందు విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.











