టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీలో నూతనోత్తేజం నింపేందుకు పార్లమెంటు స్ధానాల వారీగా అధ్యక్షులను నియమించారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ పార్లమెంటుకు కమ్మ సామాజికవర్గం నుంచి నెట్టెం రఘురాం, మచిలీపట్నం పార్లమెంటు బాధ్యతలు బీసీ నేత కొనకళ్ల నారాయణస్వామికి అప్పగించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో పెద్దగా వివాదాలు లేకపోయినా మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో టీడీపీ నేతలకు పొసగడం లేదు.
మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం బాధ్యతలు చూస్తున్న కొనకళ్ల నారాయణస్వామికి, పెడన నియోజకవర్గ ఇన్ ఛార్జి కాగిత వెంకట్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు కొనకళ్ల నారాయణస్వామిని కలసి అభినందనలు తెలిపారు. కానీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత వెంకట్రావు మాత్రం నారాయణస్వామికి కనీసం అభినందనలు కూడా తెలపకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయంగా మారింది.
ఎవరివారే యమునాతీరే..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాగిత వెంకట్రావు తనయుడు కాగిత వెంటక కృష్ణ ప్రసాద్ ను పెడన నియోజకవర్గంలో రంగంలోకి దింపారు. కొన్నాళ్లుగా కాగిత వెంకట్రావు తనయుడిని రాజకీయాలకు పరిచయం చేయాలని భావించారు. అందుకే 2109లో వెంకట కృష్ణ ప్రసాద్ ను రంగంలోకి దింపారు. ఆయన ఓటమి పాలయ్యారు. పెడనతో కొనకళ్ల నారాయణ స్వామి తనయుడిని కూడా ఎన్నికల్లోకి దింపాలని చివరి వరకూ ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. దీంతో ఇద్దరి మధ్యా వివాదాలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారు.
కలసి పనిచేయండి
మచిలీపట్నం టీడీపీ నేతల్లో నెలకొన్న వివాదాలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు చేరాయి. వివరాలు తెలసుకున్న చంద్రబాబు ఇద్దరి నేతలకు సర్ది చెప్పారని తెలుస్తోంది. అయినా వారు తీరు మార్చుకున్నట్టు కనిపించడం లేదు. మచిలీపట్నం పార్లమెంటు స్ధానాల బాధ్యుల సమావేశంలోనూ ఇద్దరు నేతలు ఎడమొహం పెడమొహంగా వ్యవరించారట. దీంతో వీరు కలసి పనిచేస్తారా? లేదా అనేది భవిష్యత్తులోనే తేలాల్చి ఉంది.











