అక్కినేని నాగార్జున , డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇంతవరకూ ‘శివమణి, సూపర్’ సినిమాలు వచ్చాయి. జయాపజయాల సంగతి పక్కనపెడితే.. ఈ కాంబోకి మంచి పేరొచ్చింది. సాధారణంగా పూరీ సినిమాల్లోని హీరోలు .. పనీపాటా లేని పోకిరీలో, లేక ఇడియట్స్ లో అయి ఉంటారు. కానీ నాగ్ తో తీసిన ఆ రెండు సినిమాల్లోనూ ఆయన కేరక్టరైజేషన్స్ ను కాస్తంత డీసెంట్ గా ఉండేలా డిజైన్ చేశాడు. అయితే ఈ రెండింట్లోనూ కామన్ గా యారోగెన్సీ ఉంటుందనుకోండి అది వేరే విషయం .
అసలు మేటర్లోకి వస్తే .. త్వరలోనే నాగ్, పూరీ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన పూరీ.. అదే సక్సెస్ మోడ్ తో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు పయనమవబోతోంది యూనిట్.
బాలకృష్ణ, చిరంజీవితో కూడా పూరీ సినిమాలు తీయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగార్జునతో మరోసారి పూరీ సినిమా తీయబోతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల నాగ్ కు పూరీ కథ నెరేట్ చేశాడట. ఫాంటసీ తరహాలో ఉండే ఆ కథకు నాగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. లాక్ డౌన్ టైమ్ లోనే పూరీ ఈ సినిమా కథ రాసుకున్నాడట. మరి ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.