రక్త పిశాచుల గురించి విన్నాం. తొలిసారి జగన్మోహన్‌రెడ్డి రూపంలో ధన పిశాచిని చూస్తున్నాం. రోజూ నోట్ల కట్టలతో వంట చేసుకుని, నోట్ల కట్టలే తిన్నా.. పది తరాలకు తరగనంత దోచి, దాచుకున్నా జగన్‌రెడ్డికి ఇంకా ధన దాహం తీరడం లేదు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నిరుపేదలు, కూలీలు రోజంతా రెక్కలు, ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుని మద్యం పేరుతో లాగేస్తున్నారని ఆరోపించారు.
జగన్‌రెడ్డి బినామీలు తయారు చేసి అమ్ముతోన్న మద్యంలో విషరసాయనాలున్నాయని తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా బయటపెడితే, మద్యంపై ఆదాయం రావడం టిడిపికి ఇష్టంలేదంటూ కొత్త ఏడుపు మొదలుపెట్టారని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పదులసంఖ్యలో మృత్యువాతపడితే సహజమరణాలంటూ శవాలపై నోట్లు ఏరుకున్నారని ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలో జే బ్రాండ్ మద్యం తాగి ఇద్దరు చనిపోతే, కేసుని నీరుగార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మీరు తయారుచేసి మీరే అమ్ముతోన్న విషమద్యం తాగి ముగ్గురు బలయ్యారని దుయ్యబట్టారు. మరి కొంత మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా ఇసుకపల్లి ప్రభుత్వ మద్యం షాపులోనే మద్యాన్ని కొన్నారని తెలిపారు.
మహిళల తాళిబొట్లు తెంచే సొంత విషమద్యం అమ్మకాలతో లాభం, వేరే మద్యం అమ్మాలంటే కమీషన్లు, మద్యం ఆదాయంపై అప్పులు, మద్యంపై బాండ్లతో కోట్లు, మద్యంషాపులో వైసీపీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇన్ని లాభాలు పొందుతున్న జగన్‌రెడ్డి గారు జలగలా ప్రజల్ని పీల్చేస్తున్నారని విమర్శించారు. విషమద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తూ కోట్లు లెక్క పెట్టుకుంటున్న ముఖ్యమంత్రి గారూ మీ జే బ్రాండ్ విషమద్యంతో ఇంకెందరిని బలి తీసుకుంటారు? అని ప్రశ్నించారు.ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్లు అమ్మకం నిలిపేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నివైన్‌షాపుల నుంచీ శాంపిళ్లని సేకరించి ల్యాబుల్లో పరీక్షించాలి. జే బ్రాండ్స్ తాగి చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబానికి 50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని హరిస్తూ, ప్రమాదకర మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తూ వేలకోట్లు వెనకేసుకుంటున్న మద్యం మాఫియాపై కేంద్రం సీబీఐతో దర్యాప్తు చేయించాలని లోకేశ్ కోరారు.