తన సినీ కెరీర్ పై టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం తీసుకోబోతోందా ?ఇప్పటికే పెళ్లి, పిల్లలు అన్నీ హడావుడిగా కానిచ్చేసిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోయిన్ ల బాట పట్టనుందా ? కాజల్ అభిమానులను కలవరపెడుతున్న ఆ అంశం ఏమిటి ?
సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీకళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. చందమామ మూవీతో అందరి మన్ననలు పొందిన ఈ బ్యూటీ.. తెలుగు , తమిళం, కన్నడ, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్స్ సరసన నిలిచింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ ఇలా యంగ్ హీరోలందరితోనూ నటించిన ఈ అమ్మడు మెగాస్టార్, పవర్ స్టార్ లతో కూడా జతకట్టింది.అందాల ఆరబోతలోనే కాదు, ఏ పాత్రలో అయినా ఇమిడిపోయి నటించడం కాజల్ ప్రత్యేకత.
అయితే కాజల్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోబోతోందనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. కరోనా సమయంలో హడావుడిగా పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ అంతే స్పీడ్ గా తల్లి అయిపోయింది.ఈ నేపధ్యంలోనే కాజల్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.కాగా ఈ విషయం పై కాజల్ అగర్వాల్ వైపు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఆమె కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందని టాక్.
ఇటీవలే కాజల్ “నీల్ కిచ్లూ” అనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో తన పూర్తి సమయాన్ని తన కుమారుడికే కేటాయించాలని కాజల్ భావిస్తోందట. సినిమాలలో నటిస్తే కొడుకుతో సమయం గడిపేందుకు ఉండదనే ఆలోచనలో ఆమె ఉన్నారని.. అందుకే కాజల్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని టాక్. కాగా, కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా పెళ్లైన తర్వాత సినీ పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్లు పెళ్లైన తర్వాత సినిమాలకు దూరమై, తమ కుటుంబాల కోసం వారు సినీ కెరీర్ కు ముగింపు పలికారు.మరికొందరు మాత్రం వారి పిల్లలు పెద్దైన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు కాజల్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉందనే చర్చ సినీ వర్గాల్లో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే కాజల్ సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతోందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారట.ఇక పై తమ అభిమాన నటి నటించబోదనే వార్త వారికి రుచించడం లేదట. కాజల్ తన అభిప్రాయాన్ని మార్చుకుని సినిమాల్లో కొనసాగాలని కోరుతున్నారట. మొత్తానికి ఈ అంశానికి తెర పడాలి అంటే దీనిపై కాజల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.











