పక్కవారి అసమర్ధతను తనకు అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నారా ? ఏపీ పై ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి ? ఇంతకాలం జగన్ తో అంటకాగి ఒక్కసారిగా ఎందుకు వ్యతిరేక రాగం ఎందుకు అందుకున్నారు ? కడుపు మంట వెళ్లగక్కిన కేటీఆర్ వెంటనే వెనక్కి తగ్గడం వెనుక ఉన్న రాజకీయ కోణం ఏంటి ?
రాజకీయ పార్టీల మధ్య పోటీ సహజం. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం సర్వ సాధారణం.అధికార పక్షం మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం పై అధికార పక్షం ఆరోపణలు చేసుకోవడం అనాదిగా ఒక ఆనవాయితీగా మారింది. అయితే అది రాజకీయ వేదికల మీద చేసుకోవడం వరకు పరిమితమైతేనే దానికి అందం. కానీ ప్రస్తుతం ఆ రాగం శృతి మించుతోందనే చర్చ తెరపైకి వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇటీవల ఓ వ్యాపార సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పొరుగు రాష్ట్రం అయిన ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే లేపాయి.ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ ఆయన ఒక వ్యాపార సమావేశ వేదిక పై ప్రసంగించడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.ఈ అంశంలో కేటీఆర్ పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కవారి అసమర్ధతను తమను అనుకూలంగా మార్చుకోవాలనే దురుద్దేశ్యంతో ఆయన ఈ కామెంట్స్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. అది ఎవరూ కాదనలేని విషయమే. అయితే కేటీఆర్ ఆ సమావేశంలో ఏపీ ప్రస్తావన తేవడం దేనికనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రతిపక్షంగా ఉన్నది బిజెపి.. అలాంటప్పుడు కేటీఆర్ తమ ప్రభుత్వం గొప్పను చాటుకోవాలి అనుకున్నా, లేదా పక్కవారి వైఫ్యల్యాలను చూపాలి అనుకున్నా బిజెపి అసమర్ధతనో, లేక బిజెపి పాలిత ప్రాంతాలనో ఉదాహరిస్తూ మాట్లాడితే వేరేగా ఉండేది. అలా కాకుండా ఏపీ పేరును ప్రస్తావించడం ఎంత వరకు సమంజసం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏపీ ఇమేజ్ ని డామేజ్ చేసేలా ఉన్నాయనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ఒక వ్యాపార సమావేశ వేదిక పై ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది.నిజానికి ఒక రాష్ట్రం అభివృద్ధి చెండాలి అంటే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంతో అవసరం. ఇక పసిబిడ్డగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ జగన్ పరిపాలనలో కొన ఊపిరితో కొట్టుకుంటున్న పరిస్థితిలో ఉంది.ఇప్పుడు కేటీఆర్ ఒక వ్యాపార సమావేశంలో ఏపీ పరువు తీసేలా చేసిన కామెంట్స్ తో ఆ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్న కేటీఆర్ తమ గొప్పను చాటుకోవడానికి అవతలి వారి అవకాశాలకు గండి కొడుతున్నారనే భావన రాజకీయ వర్గాలలో నెలకొంది.
ఇదిలా ఉంటే నిన్నటి వరకు జగన్ తో అంటకాగిన కేటీఆర్ ఒక్కసారిగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని టాక్. నిజానికి ఏపీ, తెలంగాణల మధ్య జలవివాదం జరుగుతుండగా.. టీఆర్ఎస్, బిజెపి మధ్య యుద్ధం మొదలయ్యాకా ఈ అంశంలో టీఆర్ఎస్ వాదన క్రమంగా బలహీనపడుతోందట. ఇక జల వివాదం అంశంలో పీట ముళ్ళు పడే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంగా అర్ధమవుతోందట.అందుకే ఆంధ్ర ప్రదేశ్ కి ఆ మేలు దక్కకూడదు అనే ఈర్ష్యతోనే కేటీఆర్ ఈ ఎదురుదాడిని అడ్వాన్స్ గా ప్రారంభించారనేది కొందరి వాదన.
ఇదిలా ఉంటే ఏపీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే వెనక్కి తగ్గారు. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర దాగుందనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల తెలంగాణలో ఉన్న రెడ్డి , ఎస్సీ , ఎస్టీ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని గుర్తించిన కేటీఆర్ వెంటనే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చూట్టారని కొందరు చర్చించుకుంటున్నారు. అందుకే ఈ ఘటణ జరిగిన కొద్ది గంటల్లోనే ఆయన జగన్ తనకు సోదర సమానుడు అని, జగన్ సారధ్యంలోని ఏపీ అభివృద్ధి పధంలో ప్రయాణించాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడని టాక్. అయితే ఈ అంశంలో కేటీఆర్ వ్యవహారం తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్లుగా తయారయ్యిందని.. అందుకే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
మొత్తంగా కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారగా.. ఈ ఉదంతంతో ఆయన ఆంధ్ర ప్రదేశ్ పై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు అనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.