అన్యాయాలను, అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే పక్కదారి పడుతున్నారు. గుంటూరు నగరంలోని నగరపాలెం ఎస్.ఐ.. ప్రభాకర్ రెడ్డి తప్పుడు ఎన్.సి.సి సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందాడని ఏలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందాడని తేలింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి ఉన్నతాధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వారం రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. అతని ఆచూకీ కూడా లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన ప్రభాకర్ రెడ్డి 2014లో ఏలూరు రేంజ్ నుంచి ఎస్ఐగా ఎంపికయ్యారు. అయితే అప్పటికే ఆయన వయసు రెండేళ్లు ఎక్కువగా ఉండటంతో నియామకం నిలిపివేశారు. ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్ధులకు రెండేళ్ల మినహాయింపు ఉండటంతో, ప్రభాకర్ రెడ్డి నకిలీ సర్టిఫికెట్ సమర్పించారు. ఎస్ఐ ఎంపిక పరీక్షలకు తనకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో అతను పరీక్షలకు హాజరయ్యారు. అలా 2014 బ్యాచ్ లో ఎస్ఐగా ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యారు.
శిక్షణ అనంతరం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొంతకాలం విధులు నిర్వర్తించారు. మొదటి నుంచి ఆయన వివాదాస్పద వైఖరి కారణంగా ఆరేళ్లు అయినా ప్రొబేషనరీ పూర్తి చేసుకోలేకపోయాడని పోలీసు ఉన్నత అధికారులు తెలిపారు.
అక్కడే పునాది పడింది
ఏలూరు రేంజ్ నుంచి ప్రభాకర్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడంపై పోలీసు అధికారులు అనుమానించారు. ఆయన ఎంపిక అయ్యాక సర్టిఫికేట్లను పరిశీలన నిమిత్తం గుంటూరు రేంజ్ అధికారులకు పంపించారు. అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నాయని గుంటూరు రేంజ్ అధికారులు గుర్తించారు. అయితే అప్పుడు కావాలని ఎన్సీసీ సర్టిఫికేట్ పంపించలేదు. ఈ విషయాన్ని గుంటూరు ఐజీ కార్యాలయం కూడా పెద్దగా పరిశీలించలేదు.
ఎలా బయట పడింది
ప్రకాశం జిల్లాల్లో ప్రభాకర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ విశ్రాంత ఎంఈవోతో, మరో రాజకీయ నేతతోనూ గొడవ పడ్డాడు. అతని వయసు ఎక్కువగా ఉన్నా అతనికి ఉద్యోగం ఎలా వచ్చిందని ఎస్ఐతో గొడవ పడిన వారు ఆరా తీయడం మొదలు పెట్టారు. సమాచార హక్కు చట్టం ప్రయోగించారు. వివరాలు మొత్తం సేకరించారు. అతని ఎన్సీసీ సర్టిఫికేట్ నికిలీదని గుర్తించి ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు విచారణ జరిపారు. ప్రభాకర్ రెడ్డి మోసం బయటపడింది. మోసం బయటపడటంతో ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారనే సమాచారంతో ప్రభాకర్ రెడ్డి కనిపించడకుండా పోయారు. ప్రజలకు కాపాడాల్సిన పోలీసు అధికారి నకిలీ సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.











