కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని ఊహాన్ నగరంలో పుట్టిన కరోనా నేడు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల మందికి సోకింది. 11 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. మన దేశంలోనే 70 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. లక్ష మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనాకు అదిగో టీకా వచ్చేస్తోంది. ఇదిగో టీకా వచ్చేస్తోందంటూ సోషల్ మీడియా, మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. రష్యాలో ఆగష్టు 14 నాటికే టీకా విడుదలైందని అధికారికంగా ప్రకటించారు. ఇక చైనాలో ఇప్పటికే చాలా మందికి టీకాలు వేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి మనదేశంలో కోవిడ్ కు టీకా ఎప్పుడు వస్తుందో కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్ధన్ ఇవాళ ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు.
పరిశోధనలు ఎక్కడి దాకా వచ్చాయంటే..
2021 ప్రారంభానికి మన దేశంలో టీకా వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. దేశం మొత్తం మీద 40 టీకాలు వివిధ దశల్లో ట్రయల్స్ లో ఉన్నాయన్నారు. ఇందులో పది టీకాలు చివరి దశకు అంటే మూడో దశకు చేరాయని హర్షవర్ధన్ వెల్లడించారు. అనేక సంస్థల నుంచి వచ్చే ఏడాది ప్రారంభంలో టీకాల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ టీకా తయారు చేసే అనేక సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని టీకా పంపిణీ ఎలా చేయాలన్న దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
ముందుగా టీకా ఎవరికి వేస్తారు?
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా ఎవరికి వేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందుగా హైరిస్క్ ఉన్నవారు అంటే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, విలేకరులతోపాటు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే ప్రకటిచింది. చిన్నారులను కూడా ఈ జాబితాలో చేర్చారు.
టీకా పంపిణీకి చకచకా ఏర్పాట్లు
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించే కంపెనీల నుంచి సేకరించి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. కరోనా టీకా నిల్వ,పంపిణీకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే కోరింది. దీనిపై ఆయా రాష్ట్రాలు ఎంత వరకు సిద్దం అయ్యాయనే దానిపై కూడా కేంద్రం దృష్టి సారించింది. పలు దేశాల్లో కరోనా టీకా ట్రయల్స్ మూడో దశకు చేరినా కేంద్ర ప్రభుత్వం మాత్రం మన దేశంలోనే కరోనా టీకా ముందుగా విడుదలయ్యే అవకాశం ఉందనే ఆశాభావంతో ఉంది. మన దేశ అవసరాలు తీర్చడంతోపాటు, పలు దేశాలకు కూడా కరోనా టీకాను, భారత్ లోని పలు కంపెనీల నుంచి సరఫరా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చైనా భూతానికి భారత్ మందు కనిపెట్టినట్టేనన్న మాట.