ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్ బాధితులు 4 లక్షలు దాటిపోయారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 10000 పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సగటున రోజుకు 86 మంది చనిపోతున్నారు. ఏపీలో పట్టణ ప్రాంతాల నుంచి మారుమూల గ్రామాలకు కరోనా వ్యాపించింది. దీంతో కరోనా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలను కూడా కరోనా కేంద్రాలుగా మార్చారు. కనీసం పడకలు కూడా లేని కాలేజీల్లో కరోనా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్లు కనీసం తొంగి చూడటం లేదు. దీంతో కరోనా రోగులు బెంబేలెత్తిపోతున్నారు.
గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకలి కేకలు….
కోవిడ్ రోగులకు పౌష్ఠిక ఆహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి రోజుకు రూ.500 ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే కరోనా రోగులకు అందుతున్న నాసిరకమైన ఆహారంతో మరిన్ని రోగాలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. గుంటూరులో జీజీహెచ్ ను కరోనా సెంటర్ గా మార్చారు. దాదాపు 1500 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజూ కోవిడ్ రోగులకు ఉదయం 8 గంటలకల్లా అందాల్సిన అల్పాహారం 11 గంటలకు కూడా అందించడం లేదు.
ఇక మధ్యాహ్నం ఒంటిగంటకు ఇవ్వాల్సిన భోజనం సాయంత్రం 4 గంటలైనా రావడం లేదని కరోనా రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగుల్లో చాలా మంది షుగర్ పేషెంట్లు కూడా ఉండటంతో వారు సమయానికి మందులు వేసుకోలేక పోతున్నారు. దీంతో జీజీహెచ్ లో ప్రతి రోజూ కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఆకులగణపవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జీజీహెచ్‌లో కరోనా చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన వ్యక్తి ఆసుపత్రిలో చేరేప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా బాధితుడికి షుగర్ కూడా ఉండటంతో జీజీహెచ్ లో సమయానికి ఆహారం లేక మందులు వేసుకోలేకపోయాడు. దీంతో గురువారం రాత్రి ఆ వ్యక్తి చనిపోయాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక గుంటూరు ఆసుపత్రిలో కరెంటు కోతలకు లెక్కే లేదు. రోజుకు 20 సార్లు కరెంటు పోతోందని, దోమల బాధ పడలేకపోతున్నామని కరోనా రోగులు వాపోతున్నారు.
ఒంగోలు కరోనా కేంద్రంలో సదుపాయాలేవీ?
ఒంగోలు రిమ్స్‌లో కరోనా రోగుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ ఆసుపత్రిలో దాదాపు 1000 మంది చికిత్స పొందుతున్నారు. వారికి సకాలంలో ఆహారం అందించడంలో కాంట్రాక్టు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కరోనా రోగులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కరోనా రోగులకు రోజుకు ఆహారానికి రూ.500 ఖర్చు చేస్తున్నా కాంట్రాక్టు తీసుకున్నవారు కనీసం రూ.100 విలువైన ఆహారం కూడా ఇవ్వడం లేదని కరోనా బాధితులు ఆరోపిస్తున్నారు. ఏపీలో కరోనా వస్తుందన్న భయంకన్నా కరోనా వస్తే ప్రభుత్వం క్యారంటైన్ కేంద్రాల్లో ఎలా ఉండాలో అని చాలా మంది ఆందోళన చెతున్నారు.
సీఎం చెప్పినా పడక దొరకదు…
కరోనా రోగులకు అరగంటలో బెడ్ కేటాయించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు అధికారులను ఆదేశించారు. వాస్తవంలో మాత్రం అమలు కావడం లేదు. ఆర్థిక స్తోమత ఉండి ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించినా వారు కూడా బెడ్లు లేవని వెనక్కు పంపించేస్తున్నారు. ఇక ప్రభుత్వ క్వారంటైన్ కు వెళ్లేందుకు చాలా మంది భయపడి కరోనా టెస్టులకే రావడం లేదని తెలుస్తోంది. మొదట్లో మండల కేంద్రాల్లో ప్రతి రోజూ వంద కరోనా శాంపిల్సు తీసుకునే వారు. నేడు కనీసం 20 నుంచి 30 మంది కూడా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు.
కరోనా పాజిటివ్ వస్తే ప్రభుత్వం క్యారంటైన్ కేంద్రాలకు తరలిస్తుందని అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవని చాలా మంది భయపడుతున్నారు. అందుకే అసలు టెస్టులకే ముందుకు రావడం లేదు. తీరా కరోనా ముదిరాక వెళితే ఆక్సిజన్ అవసరం అవుతోంది. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉన్నా అవసరమైన మేర అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్య.
మహారాష్ట్రను మించిపోతున్న ఏపీ
కరోనా వ్యాప్తి విషయంలో ఏపీ, మహారాష్ట్రను మించి పోయింది. మహారాష్ట్రలో 11 కోట్ల జనాభాకు 7 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 5 కోట్ల జనాభాకు ఇప్పటికే 4.5 లక్షల కరోనా కేసులు వచ్చాయి. ప్రతి రోజూ పది వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కొద్ది రోజుల్లోనే ఏపీలో 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.