ఏపీలో మహిళల రక్షణ కోసమంటూ కొత్తగా ఏర్పాటు చేసిన దిశ యాప్ పై అవగాహన కల్పించే నిమిత్తం మొన్నామధ్య విజయవాడ పరిధిలోని గొల్లపూడిలో నిర్వహించిన ఓ సభలో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి సీఎంగా ఓ మహిళ ఉన్నారంటూ తడబడ్డారు. ఆపై సర్దుకుని హోం మినిస్టర్ గా మహిళ ఉన్నారంటూ గొప్పలు చెప్పుకున్నారు కదా. అదంతా ఒట్టి డాంబికమేనని, హోం మినిస్టర్ గా ఉన్న మేకతోటి సుచరిత ఆ పదవిలో ఉత్సవ విగ్రహం మాదిరిగా ఉన్నారని, ఆమెను అలా వైసీపీ నేతలే మార్చేశారని ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా బహిరంగంగానే కాస్తంత గట్టిగానే ఆరోపిస్తున్నారు. ఏపీ హోం మినిస్టర్ సుచరిత కాదని, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డే హోం మినిస్టర్ గా వ్యవహరిస్తున్నారని లోకేశ్ సంచలన ఆరోపణ చేశారు.
లోకేశ్ మాటల్లో నిజముందా?
విపక్ష హోదాలో ఉన్న టీడీపీ నేతగా, మాజీ మంత్రి, ప్రస్తుతం శాసనమండలిలో పార్టీ నేతగా ఉన్న నారా లోకేశ్ ఏదో ఇలా వచ్చాం.. అలా మాట్లాడేశాం అన్న రకం కాదు కదా. పక్కా నిదర్శనాలుంటేనే ఆయన మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అంటే.. మరి లోకేశ్ చెప్పినట్టుగా ఏపీ హోం మినిస్టర్ గా సుచరిత కాకుండా సజ్జల వ్యవహరిస్తున్నారా? అంటారా? అందుకు కూడా బోలెడు నిదర్శనాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా పరిధిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు జిల్లాకు చెందిన మంత్రిగా సుచరిత తప్పనిసరిగా హాజరవుతారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం ఏమీ లేని సజ్జల కూడా హాజరవుతారు. అదేంటో గానీ.. హోం మినిస్టర్ గా ఉన్న సుచరిత కంటే కూడా సలహాదారుగా ఉన్న సజ్జలకే ఆయా కార్యక్రమాల్లో అత్యధిక ప్రాధాన్యం దక్కుతుంది. సజ్జల రిబ్బన్ కట్ చేస్తుంటే.. అనామకురాలిగా సుచరిత ఎక్కడో వెనుక వరుసలో నిలుచుని కనిపిస్తుంటుంది. ఒకానొక సందర్భంలో సజ్జలకు దక్కిన ప్రాధాన్యం.. తనను పట్టించుకోని వైనంపై తీవ్ర మనస్తాపానికి గురైన సుచరిత కార్యక్రమం మధ్యలోనే వేదిక దిగేసి వెళ్లిపోయారు. ఇలా చెప్పుకుంటే పోతే.. చాలా నిదర్శనాలే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే లోకేశ్ ఆరోపణల్లో నిజమున్నట్లే కదా.
అన్నీ అబద్దాలేనా?
గుంటూరు జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచారాలు హోం మినిస్టర్ సుచరితను డిఫెన్స్ లో పడేశాయని చెప్పాలి. హోం మినిస్టర్ సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇక మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై స్పందించిన సుచరిత.. దిశ చట్టంతో ఇప్పటిదాకా ముగ్గురికి ఉరిశిక్షలు పడ్డాయని, 20 మందికి యావజ్జీవ శిక్షలు పడ్డాయని తెలిపారు. ఇదే విషయాన్ని అస్త్రంగా తీసుకున్న టీడీపీ కీలక నేత వర్ల రామయ్య.. ఆ శిక్షలు ఎక్కడ? ఎవరికి? పడ్డాయో తెలుపుతూ ఓ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుచరిత చెప్పిన మాటలన్నీ అబద్దాలేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సజ్జల ఏం చెప్పమంటారో.. అదే విషయాన్ని సుచరిత చెబుతారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా డమ్మీ హోం మినిస్టర్ గా సుచరిత మిగిలితే.. యాక్టింగ్ హోం మినిస్టర్ గా సజ్జల వ్యవహరిస్తున్నాన్న మాట.
Must Read ;- రమ్య తరహా ఘటనల లెక్క ఇది