Nara Lokesh Arrest :
బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన గుంటూరు జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందని, పోలీసులు వైసీపీ కార్యకర్తల మాదిరిగా మారిపోయి టీడీపీ నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారన్న వాదనలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఆదివారం నాడు.. అది కూడా స్వాతంత్య్ర దినోత్సవం నాడు రమ్యను పట్ట పగలు నడిరోడ్డుపై ప్రేమోన్మాది శివకృష్ణ కత్తితో దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత సొంత జిల్లాలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం, ఈ ఘటనపై పోలీసులు సరిగా స్పందించకోవడం, రమ్య కుటుంబానికి పరిహారం ప్రకటించేసి చేతులు దులుపుకునే రీతిలో జగన్ సర్కారు వ్యవహరించిన తీరుపై విపక్ష టీడీపీ మండిపడింది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని టీడీపీ కీలక నేతలు రమ్య మృతదేహానికి నివాళి అర్పించడంతో పాటుగా బాధిత కుటుంబానికి బాసటగా నిలిచేందుకు బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి.
నక్కాపై గున్నీ దాడి
నారా లోకేశ్ తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్ లతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. అంతేకాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మరింత మంది టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. నారా లోకేశ్ ను అడుగు కూడా ముందుకు వేయకుండా అడ్డగించాయి. ఈ క్రమంలో లోకేశ్ కు వలయంగా మారిన టీడీపీ నేతలు పోలీసుల తీరుపై పెద్ద పెట్టున నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో తమదైన శైలిలో దూకుడు చూపించిన పోలీసులు టీడీపీ నేతలపై జులుం ప్రదర్శించారు. ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించిన లోకేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ ను పోలీసు జీపులోకి ఎక్కించి ఆయనను అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం లోకేశ్ ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత టీడీపీ నేతలు నక్కా, ఆలపాటి, ధూళిపాళ్ల, తెనాలిలపై పోలీసులు తమదైన శైలి ప్రతాపం చూపారు. ఆలపాటిని ఏకంగా కింద పడేశారు. ఆ తర్వాత ఆయనను ఎత్తి లారీలో పడేశారు. ధూళిపాళ్లను కూడా అలాగే ఎత్తి లారీలో పడేశారు. ఆ తర్వాత నక్కా ఆనందబాబుపై ఏకంగా గుంటూరు రూరల్ ఎస్సీ విశాల్ గున్ని ఏకంగా చేయి చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద పెట్టున పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వెరసి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం లోకేశ్ మాదిరే టీడీపీ నేతలు నక్కా, ఆలపాటి, ధూళిపాళ్ల, తెనాలిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
మీడియాపైనా ప్రతాపం
ఇదిలా ఉంటే.. టీడీపీ నేతలపై జులుం, నారా లోకేశ్ ను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తనదైన శైలి ప్రతాపం చూపారు. పలువురు పోలీసులను పిలిచి మరీ మీడియా ప్రతినిధులపైకి దాడికి గున్నీ పురమాయించారు. అంతేకాకుండా స్వయంగా విశాల్ గున్నీనే రంగంలోకి దిగిపోయారు. ఓ మీడియా ప్రతినిధి చేతిలోని కెమెరాను తీసుకున్న గున్నీ.. దానిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా పలువురు మీడియా ప్రతినిధులను గున్నీ తోసేశారు. మొత్తంగా అసలు అక్కడ జరుగుతున్న ఘటనలను కవర్ చేయకుండా గున్నీ అడ్డుకునే యత్నం చేశారు. దీంతో టీడీపీ నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా పోలీసులు వైఖరిపై ప్రత్యేకించి ఎస్పీ గున్నీ వ్యవహార సరళిపై నిరసన వ్యక్తం చేశారు.
Must Read ;- లోకేశ్ తొలి అరెస్ట్ ఏపీని షేక్ చేసింది!