కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ప్రారంభమయ్యాయి. పెద్ద సినిమాలు విడుదలకు ముందుకు రాకపోయినా చిన్న సినిమాలు మాత్రం విడుదలకు క్యూకట్టాయి. దాదాపు ఓ 20 చిత్రాలు విడుదలయ్యాయి. ఇన్ని చిత్రాలు విడుదలైతే కళకళలాడాల్సిన థియేటర్లు వెలవెల పోయాయి. కానీ ఓ రెండు చిత్రాలు మాత్రం ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. అవి మరేమిటో కాదు ఎస్.ఆర్. కళ్యాణ మండపం, రాజ రాజ చోర. నిజానికి ఈ రెండూ కూడా చిన్న చిత్రాలే. ఆగస్టు 6న విడుదలైన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మీద ఓ విధమైన హైప్ వచ్చింది.
హీరోగా కిరణ్ అబ్బవరం చలాకీ తనం, అందులోని రెండు పాటలు ఈ సినిమా మీద హైప్ రావడానికి కారణం. కానీ సినిమా విడుదలైన రోజు డివైడ్ టాక్ వచ్చి సినిమా యావరేజ్ గా నిలిచింది. అలాంటిది ఆ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. అందులో సాయికుమార్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. సినిమా యావరేజ్ గా ఉన్నా కలెక్షన్ల పరంగా దూసుకెళ్లింది. రివ్యూలు పాజిటివ్ గా రాకున్నా సినిమాకు కలెక్షన్లు రాబట్టడంలో అవి ఏమీ చేయలేకపోయాయి. ఐఎండీబీ దీనికి 10కి 7.8 రేటింగ్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ఓ మాదిరి కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
చోరుడు మనసు కొల్లగొట్టాడు
శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ‘రాజరాజ చోర’ చిత్రం ఆగస్టు 19న విడులైంది. రివ్యూల పరంగా పాజిటివ్ టాక్ వచ్చేసింది. మొదటి రోజు కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం ఈ సినిమా విఫలమైనా సినిమా బాగుందన్న టాక్ రావడంతో క్రమేపీ ఆదరణ పెరిగింది. దీనికి ఐఎండీబీ 10కి 9.6 రేటింగ్ ఇచ్చింది. పైగా రివ్యూలన్నీ పాజిటివ్ గా ఉన్నాయి. ఆదివారంతో ఈ సినిమా కెపాసిటీ ఏమిటన్నది తేలిపోతుంది.
పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందింది. దర్శకుడిగా హసిత్ గోలి మంచి మార్కులు కొట్టేశాడు. సినిమాలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలా పట్టంగడతారనడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. హీరోగా శ్రీవిష్ణు ఖాతాలో మళ్లీ ఓ మంచి హిట్ పడ్డట్టే. థియేటర్లు ప్రారంభమైన తర్వాత చిన్న సినిమాల్లో పెద్ద సినిమా ఏది అంటే ఎవరి నుంచైనా ‘రాజ రాజ చోర’ అన్న సమాధానమే వస్తోంది. అందుకే ఈ చోరుడు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టేశాడు.
Must Read ;- మహానటి కీర్తి ఇలా ఓటీటీకి ఏల?











