There Is No Protection For Girls Under The Jagan Regime :
పట్ట పగలు.. నట్ట నడిరోడ్డు.. జనంతో కిటకిటలాడే నగరం.. జనమంతా చూస్తున్నారు.. అయితేనేం.. ఓ ప్రేమోన్మాది బరి తెగించాడు. అభం శుభం తెలియని ఓ యువతిని.. అందులోనూ ఇంజినీర్ గా మరో ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభిద్దామని ఆశపడుతున్న యువతిని చేయి పట్టుకుని మరీ లాగాడు.. అతడిని ఆమె విదిలించి కొట్టింది. అయినా వెనక్కు తగ్గని అతడు ఆమెను పదే పదే చేయి పట్టి లాగాడు. అయినా ఆమె అతడి మాట వినలేదు. దీంతో అతడు శివాలెత్తిపోయాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు.. ఒక పోటు.. ఆ వెంటనే మరో పోటు.. అలా పొడుస్తూనే ఉన్నాడు.. ఆ దుర్మార్గుడి బారి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి యత్నిస్తూనే ఉంది.. అయినా అతడు వదల్లేదు. కడుపుతో పాటు మెడపైనా ఇష్టారాజ్యంగా పొడిచేశాడు..ఇంకేముంది ఆ యువతి అక్కడే రోడ్డుపైనే పడిపోయింది.. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. ఇదీ ఆదివారం నాడు గుంటూరు పట్టణం కాకానిలో చోటుచేసుకున్న ఘటన.
జనం చూస్తుండగానే..
ఏదో జన సంచారం లేని ప్రాంతంలో ఆ ప్రేమోన్మాది బాధితురాలిపై దాడి చేయలేదు. జనమంతా చూస్తుండగానే.. నడిరోడ్డుపై ఆమెపై విరుచుకుపడ్డాడు. కత్తితో ఆమెపై దాడి చేస్తున్న సమయంలో అక్కడికి కొందరు పరుగు పరుగున వచ్చినా.. అతడిని ఆపేందుకు మాత్రం ముందుకు రాలేదు. వెరసి జనారణ్యంలోనే ఓ ఉన్మాది దాడిలో ఏ పాపం తెలియని యువతి బలైపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీ ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. ఈ ఫుటేజీని చూస్తుంటే.. అసలు ఏపీలో మహిళలకు రక్షణ ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామంటూ ఓ వైపు జగన్ చెబుతున్నా.. ఆ భద్రతను పర్యవేక్షించే హోం మంత్రి సొంత జిల్లాలోనే ఈ దారుణం జరిగిన తీరు నిజంగానే ఏపీలో మహిళలు.. ప్రత్యేకించి యువతులు, విద్యాభ్యాసం కొనసాగిస్తున్న బాలికలకు రక్షణ లేదనే చెప్పాలి.
దిశ యాప్ రక్షించలేదుగా
గుంటూరులోని సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్న రమ్య (19)పై గుంటూరు జిల్లాకే చెందిన శివకృష్ణ అనే యువకుడు విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఏపీలో పెను కలకలమే రేపుతోంది. రమ్య, శివకృష్ణల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. ఓ యువతిని, అది కూడా ఇంజినీరింగ్ విద్యార్థినిని ఓ ప్రేమోన్మాది నడిరోడ్డుపై కత్తితో దాడి చేసిన చంపిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ జగన్ చెబుతున్నారు. అంతేకాకుండా మహిళల రక్షణ కోసమంటూ దిశ చట్టాన్ని ప్రతిపాదించారు. దిశ యాప్ ను ప్రారంభించారు. ఏకంగా దిశ పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవేవీ మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్న వైనం మాత్రం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న క్రమంలోనే రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఓ మహిళను నియమించామని జగన్ గొప్పలు చెబుతున్నారు. ఆ మహిళా హోం మినిస్టర్ సొంత జిల్లాలోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్న తీరు మాత్రం కలకలమే రేపుతోంది. మొత్తంగా జగన్ జమానాలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందన్న వాదనలు మరింత బలపడిపోయాయి.
జగన్ చలించిపోయారట
ఇదిలా ఉంటే.. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. రమ్య హత్య ఘటన గురించి సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారని, ఆయన చలించిపోయారని హోంమంత్రి వెల్లడించారు. యువతిని హత్య చేసే హక్కు ఎవరిచ్చారని ఆమె ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తికి కచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారని, హంతకుడి కోసం గాలింపు జరుగుతోందని చెప్పారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడిన డీజీపీ గౌతం సవాంగ్.. నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లుగా కూడా సీఎంఓ నుంచి ప్రకటన వచ్చింది. జగన్ చలించినా.. సుచరిత కంట తడిపెట్టినా.. నిందితుడిని అరెస్ట్ చేశామని డీజీపీ ప్రకటించినా.. బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించినా.. చనిపోయిన రమ్య బతికి వస్తుందా? అంటూ ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఇవే ప్రశ్నలతో గుంటూరు జీజీహెచ్ కు వచ్చిన హోం మంత్రి సుచరితను జనం అడ్డుకున్నారు.
Must Read ;- లోకేశ్ తొలి అరెస్ట్ ఏపీని షేక్ చేసింది!
ఈ మాట నిజమే: చంద్రబాబు
ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదని విచారం వ్యక్తం చేశారు. గుంటూరులో దళిత విద్యార్థిని హత్య తీవ్రంగా కలచివేసిందని అన్నారు. సీఎం నివాసానికి దగ్గర్లో ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇప్పటిదాకా 500కి పైగా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నాగానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని విమర్శించారు. సీఎం సోదరి సునీతారెడ్డికి ప్రాణహాని ఉందంటే, సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరుకుతుందని అన్నారు. రమ్య కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రమ్య మృతదేహానికి నివాళులు అర్పించడంతో పాటుగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాసేపట్లో గుంటూరు జీజీహెచ్ కు వెళ్లారు. అప్పటికే పోస్టుమార్టం పూర్తి అవడంతో రమ్య మృతదేహాన్ని ఆమె ఇంటికి తీసుకెళ్లడంతో అక్కడికే వెళ్లిన లోకేశ్.. రమ్యకు నివాళి అర్పించి ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
పరిటాల స్పందన చూశారా?
ఈ దారుణ ఘటనపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తనదైన శైలిలో స్పందించారు. ‘అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించిన నాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. కానీ, ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవం నాడే నడిరోడ్డుపై ఒక ఉన్మాది ఒక దళిత ఆడ కూతురు రమ్యశ్రీని కత్తితో పొడిచి చంపడం అత్యంత దారుణం. ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి. నిజంగా ఈ దిశ చట్టాలు, యాప్ లు సక్రమంగా పనిచేస్తుంటే ఇలాంటి ఘటనలు రోజూ ఎందుకు జరుగుతాయి? మీకు ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు ఉండడం లేదు?’ అని పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరామ్ స్పందన అందరినీ ఆలోచనలో పడేసిందనే చెప్పాలి.
Must Read ;- టీడీపీ దెబ్బకు వైసీపీకి బొమ్మ కనిపిస్తోందే