ఏపీలో రెండేళ్ల నాడు అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం.. అన్ని సామాజిక వర్గాల సమతూకంగా కేబినెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపడితే.. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టిన వైనం తెలిసిందే. ఈ క్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు ఏకంగా హోం మంత్రిత్వ శాఖ దక్కింది. మహిళకు కీలక బాధ్యతలు అప్పగించామంటూ జగన్ గొప్పగానే చెప్పుకున్నారు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం సుచరితను అసలు మంత్రిగానే పరిగణించడం లేదట. మహిళా మంత్రిపై తనదైన శైలి పెత్తనం చూపిస్తున్న సజ్జలహోం శాఖలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారట. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం ప్రొటోకాల్ ప్రకారంగా కూడా సుచరితను సజ్జల గౌరవించడం లేదట.
సజ్జల బ్రోకరేజీ చేస్తున్నారా?
ఇదేదో ప్రతిపక్షాలో, సజ్జల అంటే గిట్టని వాళ్లో చెబుతున్న మాట కాదు. సాక్షాత్తు సుచరిత సామాజిక వర్గానికి చెందిన గోళ్ల అరుణ్ కుమార్ చెబుతున్న మాటలు ఇవి. మాల మహానాడు జాతీయ కార్యదర్శిగా ఉన్న గోళ్ల అరుణ్ కుమార్ శుక్రవారం నాడు ఓ ప్రముఖ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ సజ్జల భాగోతాన్ని బయటపెట్టారు. ఈ సందర్భంగా గోళ్ల అరుణ్ కుమార్ ఏమన్నారంటే.. సర్పంచ్ గా గెలవని సజ్జల.. ఏ హోదాలో ప్రారంభోత్సవాలు చేస్తారు. సుచరితను అవమానిస్తున్నారు. గవర్నరమెంట్ ఆసుపత్రి, మిర్చియార్డులో ఎమ్మెల్సీ సన్మానంలోనూ దళిత మంత్రికి గౌరవం లేదు. సుచరిత శాఖలో సజ్జల వేలు పెడుతున్నారు. దళిత ఎమ్మెల్యేలు, మంత్రులను సజ్జల రబ్బర్ స్టాంపులుగా మారుస్తున్నారు. మా ఓట్లతో గద్దెనెక్కి.. మాపైనే పెత్తనం చేస్తారా? రాజకీయ వ్యభిచారం. బ్రోకరేజీ చేస్తున్న సజ్జల ఇకనైనా తగ్గాలి. ఇకనైనా ఈ తప్పులను జగన్ సరిదిద్దుకోవాలి. లేదంటే జగన్ దళితుల తిరుగుబాటును చూస్తారు* అని ఆయన ఓ రేంజిలో ఫైరైపోయారు.
సజ్జల స్పందిస్తారా?
మొత్తంగా దళిత సామాజిక వర్గానికి చెందిన సుచరితను హోం మంత్రిగా పని చేసుకోనివ్వని సజ్జల.. ఆమెకు కనీసం ప్రొటోకాల్ మేరకు గౌరవం కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలు కలకలమే రేపుతున్నాయి. అంతేకాకుండా సజ్జల సర్పంచ్ గా కూడా గెలవని నేత అంటూ గోళ్ల చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారిపోయాయి. తమపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే.. కేసులతో విరుచుకుపడుతున్న వైసీపీ సర్కారు.. మరి సజ్జలపై ఈ మేర సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న వ్యాఖ్యలు చేసిన గోళ్ల అరుణ్ కుమార్ పై ఎలాంటి చర్యలకు పాల్పడుతుందోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో ఆ ఆరోపణలకు సజ్జల నుంచి సమాధానం వస్తుందా? అన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Must Read ;- సజ్జల కామెంట్స్‌కు బ్రేకులేనా..?