(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
అంతర్వేధి ఘటన మరువక ముందే విజయవాడ కనకదుర్గ గుడిలో ఉత్సవవిగ్రహాలను ఊరేగించే రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహాల విగ్రహాల్లో మూడు మాయం అయ్యాయి. 24 కిలోల బరువైన మూడు సింహాలు ఆగంతకులు దొంగిలించారని తెలుస్తోంది. గత ఏడాది ఉగాది సమయంలో రథంపై ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆ తరువాత రథానికి ముసుగు వేశారు. సీసీ కెమెరాలు ఉన్నా బ్యాకప్ కేవలం నెల రోజులు మాత్రమే పనిచేస్తుందని దేవాలయ అధికారులు చెబుతున్నారు.
దొంగల పనేనా?
దుర్గమ్మ రథానికి 32 కిలోల 4 వెండి సింహాల విగ్రహాలు ఉన్నాయి. ఇంత విలువైన వెండి సింహాలు ఉన్న రథానికి రక్షణ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టినా అవి పనిచేయడానికి వాడే బ్యాకప్ పవర్ నెలరోజులే వస్తుందని అధికారులు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని తెలుస్తోంది. కరెంటు లేనప్పుడే కదా బ్యాకప్ వాడుకునేది. మొత్తం బ్యాటరీలపై ఆధారపడి సీసీ కెమెరాలు, కంప్యూటర్లు నడవవు కదా? ఈ విషయం చెప్పకుండా బ్యాకప్ ఒక నెల మాత్రమే వస్తుందని చెబుతున్నారు. అంటే వెండి సింహాల మాయం వెనుక కొందరి సిబ్బంది హస్తం ఉందనే అనుమానాలకు తావిస్తోంది.
ఎలా బయట పడింది?
అంతర్వేధి రథం దగ్ధం ఘటన తరవాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల రథాలు ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించాలని డీజీపీ ఆదేశించారు. దీంతో పోలీసులు ప్రముఖ దేవాలయాల రథాలు ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించారు. ఆ సమయంలో దుర్గగుడి రథానికి ఉన్న ముసుగు తొలగించారు. దీంతో మూడు వెండి సింహాలు మాయం అయ్యాయని బయట పడింది. నాలుగో సింహాన్ని కూడా దొంగిలించేందుకు ప్రయత్నం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కానీ దుండగులు నాలుగో సింహం విగ్రహాన్ని కొంతమేర పీకి వదిలేశారు.
సిబ్బందిపైనే అనుమానం?
రథానికి ఉన్న సింహాల విగ్రహాలు ఊరేగింపు అయిపోగానే ఊడతీసి, రూముల్లో భద్ర పరిచేవి కావు. రథానికి సింహాలను అతికించడంతో వాటిని ప్రతిసారి తీయడం కుదరదు. అందుకే రథానికి సీసీ కెమెరా భద్రత ఏర్పాటు చేశారు. ఈ విషయం దేవాలయ అధికారులకు తెలిసినా, స్టోర్ రూం లో ఒక్కసారి పరిశీలించి, వెండి సింహాల మాయంపై చెబుతామంటున్నారు.
దుర్గగుడి వెండి సింహాలు మాయంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే హిందూ దేవాలయాలపై దాడులతో రాష్ట్ర ప్రభుత్వం అప్రదిష్టపాలైంది. ఇక విజయవాడ దుర్గగుడిలో కూడా చోరీలు జరిగాయని తెలిస్తే ప్రభుత్వ పరువు బజారున పడుతుంది. అందుకే అధికారులు వెండి సింహాలపై మాట్లాడటానికి వెనకాడుతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చే ఆదేశాల మేరకు వారు స్పందించే అవకాశం ఉంది.
దేవాదాయ శాఖ మంత్రి ఇంటికి కూత వేటు దూరంలోనే ఘటన
ఇప్పటికే అనేక వివాదాలతో సతమతం అవుతోన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు మరో సంకటం వచ్చి పడింది. మంత్రిగారి ఇంటికి కూత వేటు దూరంలోని దుర్గగుడిలో వెండి సింహాల విగ్రహాలు మాయం అయ్యాయి. వెండి సిహాల విగ్రహాల మాయంపై విచారణ కమిటీని వేస్తున్నట్టు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. తాజా ఘటనతో ఏపీలో ప్రముఖ దేవాలయాలకే రక్షణ లేకుండా పోయిందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే : సోము వీర్రాజు
దుర్గగుడి వెండి రథం సింహాల విగ్రహాల మాయంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఇది కేవలం అధికారుల, ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ధ్వజమెత్తారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, అనంతరం గవర్నర్ ను కలసి వినతిపత్రం అందజేశారు. హిందూ దేవాలయాల్లో అసాంఘిక ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునేలా చూడాలని సోము వీర్రాజు గవర్నర్ ను కోరారు.











