కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఇప్పటి వరకు ఇంకా కనుగొనలేదు. ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుందని కొన్ని దేశాలు చెబుతున్నా.. ఇంత వరకు ఏ ఒక్క దేశం వ్యాక్సిన్‌ను కనుగొనలేకపోయింది. ఇంకా ట్రయల్స్ దశలోనే వ్యాక్సిలు ఉన్నాయి. మనదేశం కూడా వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలోనే ఉంది. వ్యాక్సిన్ వచ్చే దాకా కరోనా కేసులు పెరగకుండా ఉండవు కదా. కాబట్టి అప్పటిదాకా కరోనా చికిత్స కోసం ఇతర వ్యాధులకు ఇచ్చే ఔషధాలను, అందుబాటులో ఉన్న ఔషధాలను చికిత్సకు ఉపయోగిస్తున్నారు.
ఆ నాలుగు ఔషధాలు పనికిరావు..
వరల్డ్‌వైడ్‌గా దాదాపు 30కి పైగా దేశాల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్, ఇంటర్ఫెరాన్, రెమెడెసివర్, లోఫినావిర్‌ల కాంబినేషన్ డ్రగ్‌లనే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మందులు కరోనా చికిత్సకు ఏమాత్రం పనికిరావని ప్రపంచ ఆరోగ్యసంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా చికిత్స కోసం ఉపయోగించిన మొదటి డ్రగ్ రెమెడెసివర్ మాత్రమే. కరోనా చికిత్స కోసం ఉపయోగిస్తున్న రెమెడెసివర్ ఔషధం ఎలాంటి ప్రభావం చూపట్లేదని ప్రకటన చేసింది. కేవలం రెమెడెసివర్ మందు వల్లే కరోనా రోగులు కోలుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడినప్పుడు చికిత్సలో కూడా దీనినే ఉపయోగించారు. ఈ ఔషధమే ఇప్పుడు కరోనాకు మందుగా భావిస్తున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.
వెయ్యి మందిపై డ్రగ్స్ ట్రయల్స్…
ఈ నాలుగు ఔషధాల పనితీరు, ప్రభావంపై సాలిడారిటీ పరీక్షలను డబ్ల్యూహెచ్ఓ నిర్వహించింది. అయితే ఈ నాలుగు ఔషధాలు కరోనా రోగులకు ఇచ్చే 28 రోజుల కోర్సులో ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. కానీ అమెరికా గిలియడ్, రెమెడెసివర్‌పై కొన్ని రోజుల క్రితమే రీసెర్చ్ నిర్వహించింది. ప్లాసిబో తీసుకునే వారితో పోలిస్తే ఈ డ్రగ్ తీసుకున్న రోగులు త్వరగా కోలుకున్నట్లు తేలిందట. 1062 మందిపై నిర్వహించిన సర్వేల్లో వేరువేరు ఫలితాలు రావడం మరింత ఆందోళన కల్గించిందట. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్యసంస్థ సాలిడారిటీ ట్రయల్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ డేటా అస్థిరంగా ఉందని అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్ర వేత్త సౌమ్య స్వామినాథన్ స్పందించి జూన్‌లో నర్వహించిన అధ్యయనంలో లోఫినావిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్ చికిత్సకు పనికిరావని తేలినట్లు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఆ డ్రగ్స్‌ను నిలిపివేసినట్లు వెల్లడించారు.
ఏదేమైనా ఈ ఔషధాలు మాత్రం కొంతమేరకు కరోనా వైరస్ బారినుండి పడేందుకు ఉపశమనం కల్గిస్తున్నాయని కొందరు వైద్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు వీటిని వాడక తప్పదని పేర్కొంటున్నారు. తాజాగా డబ్ల్యూహెచ్ఓ.. డ్రగ్స్‌పై ఇలా వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది.











