ధనలక్ష్మి చంచలమైనది.. నిలకడగా ఒకచోట ఉండదు అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ విషయం దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా మరోసారి నిరూపణ అయింది. సోమవారం పొద్దున దాకా ఆ డబ్బు.. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు చెందినదే. ఆయనది కాపోతే.. ఆయన మామది. కానీ.. కొన్ని గంటల వ్యవధిలో దానిని పోలీసులు స్వాధీనం చేసేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన హైడ్రామాలో.. కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ సొమ్ములో చాలా భాగం గుమికూడిన జనంలో ఎవరికి తోచినట్టు వారు పట్టుకుపోయారు.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టడానికి అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నం చేస్తుంటాయి. సోమవారం నాడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించిన వారి ఇళ్లపై నాలుగు ఊర్లలో ఏకకాలంలో జరిగిన దాడులు కూడా ఆ రకమే అనుకోవచ్చు. ఈ దాడుల్లో రఘునందన్ రావు మామగారి ఇంట్లోంచి ఎమ్మార్వో, పోలీసులు 18.65 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
అప్పటికే విషయం రచ్చకెక్కింది. ఎక్కడెక్కడినుంచీ బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో దాదాపుగా బీజేపీ కార్యకర్తల దొమ్మీ జరిగింది. ఈ తోపులాటలు, పెనుగులాటల్లో అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్మును ఉంచిన సంచిలోంచి.. కార్యకర్తలు ఎవరి చేతికి దొరికినన్ని నోట్లకట్టలు వారు పట్టుకుపోాయారు. అధికార్లు షాక్ అయ్యారు.
వీరిలో కొందరు మాత్రం.. వీడియో కెమెరాలకు చిక్కారు. బీజేపీ రఘునందన్ రావు సొత్తు అక్రమమా కాదా? అది ఎన్నికల్లో అక్రమాలకు వాడుకోడానికి ఉంచిన డబ్బేనా కాదా? ఈ విషయాలన్నీ తర్వాత.. ఇప్పుడు ఆ డబ్బు అధికార్ల వద్ద కూడా లేకుండా పోయింది. అదీ తమాషా!
సక్రమ సొత్తే అని తేలితే ఎలా?
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పార్టీలు .. ప్రత్యర్థి వనరుల్ని దెబ్బకొట్టడం మీదే దృష్టి పెడతాయి. ఆ సొత్తు అక్రమసొత్తు కావాలనే కోరిక అధికార్లకు ఉండకపోవచ్చు. అది సక్రమం అని తేలితే తిరిగి ఇచ్చేసే ఉద్దేశమే వారికి ఉండొచ్చు. కానీ.. ఈ వ్యవహారం తేలేలోగా.. ఎన్నికల జరిగిపోతుంది. ఎన్నిక జరిగేలోగా ఖర్చు పెట్టుకోడానికి వారికి వనరులు లేకుండా ఇబ్బంది పెట్టడమే సాధారణంగా వ్యూహం అయి ఉంటుంది.
ఈ కేసులో రఘునందన్ రావు మామ.. తన వద్ద ఉన్న డబ్బు సక్రమమే అని డాక్యుమెంట్లు చూపించారనే అనుకుందాం. అప్పుడు అధికారులు ఆ డబ్బు ఎక్కడనుంచి తెచ్చి ఇస్తారు. వారు ఎంత స్వాధీనం చేసుకున్నారో లెక్క ఉంది. కానీ.. వారి చేతుల్లోంచి ప్రజలు ఎంతెంత దోచుకెళ్లారో మాత్రం లెక్కలేదు. ఏదో వీడియో ఫుటేజీలకు దొరికిన వారిని గుర్తించి, వారినుంచి స్వాధీనం చేసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కెమెరాలకు చిక్కకుండా సొమ్ము నొక్కేసిన వారిని ఏం చేస్తారు. రేపు సొమ్ము సక్రమమే అని తేలితే.. అధికారులు ఎక్కడినుంచి తిరిగి చెల్లిస్తారు? దాడులు చేసినందుకు అధికార్లకే బ్యాండ్ పడుతుందా? వారి జేబుకు చిల్లు పడుతుందా? ఇదంతా తమాషాగా కనిపిస్తోంది.











