‘అడగకుండానే వేలకు వేల రూపాయలు ప్రజల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వానికి ఇటువంటి పనులు వల్ల చెడ్డ పేరు వస్తోంది.’ విశాఖ లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ లోని ఆక్రమణల తొలగింపు పై అధికార పార్టీకి చెందిన ఓ నేత అన్నమాటలివి.
(విశాఖపట్టణం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
రాజకీయాల్లోకి వచ్చాక.. అధికారంలో ఉండే వాళ్ళు.. తమకు అనుకూలంగా కొన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు… అధికారం పోగానే వాళ్లపై దాడులు చేస్తే ఎలా..? రేపు అదే పరిస్థితి మనకు రావచ్చు… వైఎస్ఆర్ సీపీకి చెందిన మరో నేత అభిప్రాయం.
రాజకీయాలు తెలియని వాడు.. పరిపాలన విధానాలపై కనీస అవగాహన లేని వాళ్లకు కూడా అర్థమయ్యేలా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. కక్షసాధింపునకు పరాకాష్టగా విశాఖలో ప్రతిపక్ష నేతల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మాజీ మేయర్, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి.. ప్రభుత్వ భూమిని ఆక్రమించారు అంటూ కొన్ని కూల్చివేతలు, తొలగింపులు చేశారు. అంతకు ముందు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఇంటి ప్రహరీ కూల్చేందుకు ప్రయత్నం చేశారు. పాతికేళ్ళ క్రితం ఆయన ప్రభుత్వ భూమిని ఆక్రమించారని రికార్డుల ద్వారా గుర్తించామని చెప్పుకొచ్చారు.గతవారం వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గంలోని ఫుట్ పాత్ ఆక్రమణల పేరిట టిడిపి అనుకూల వర్గానికి చెందిన దుకాణాలను అడ్డగోలుగా తొలగించారు.
తాజాగా గీతం విశ్వవిద్యాలయం ఆస్తులపై అర్ధరాత్రి నుంచి విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర లో 13 జిల్లాలను చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి పట్టున్న ముఖ్య నగరం విశాఖ. నగరంలోని నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి చెందిన వారే కావడంతో అధికార పార్టీ విశాఖలో టీడీపీని కనుమరుగు చేయాలని టార్గెట్ చేసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహా పలువురు నేతలను తమ వైపునకు తిప్పుకుంది.
నయానో భయానో..
ఎంత భయపెట్టినా… ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన పార్టీ మారే ప్రసక్తి లేదని భావించిన నేతల ఆస్తులను టార్గెట్ చేసుకున్నట్టు అధికార పార్టీ వ్యవహారశైలిని బట్టి అర్థమవుతోంది. ఆక్రమణలు తప్పే కావచ్చు… కానీ వాటిని క్రమబద్ధీకరించు కునే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ.. చడీ చప్పుడు లేకుండా.. కోర్టులను ఆశ్రయించి ఉపశమనం పొందే అవకాశం లేకుండా ప్రణాళికలు రచించుకొని.. శని.. ఆదివారాలు.. కోర్టు సెలవులు వంటి సమయం చూసి తొలగింపునకు పూనుకోవడం వెనక కక్షసాధింపు తప్ప మరొక కారణం లేదన్నది నగ్నసత్యం.
బాత్ రూమ్‌లు ప్రహరీలు…
అధికారపార్టీ నానా యాగీ చేస్తూ చేపడుతున్న తొలగింపులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతిపక్ష నేత లకు సంబంధించిన ప్రహరీ గోడలు.. బాత్ రూములు.. పాన్‌షాప్‌లు.. ఇలాంటి వాటిపై దాడులు చేస్తూ నిలువెత్తు నిజాయితీలా బిల్డప్ ఇచ్చేందుకు అధికార పార్టీ ఎంతో ప్రయత్నిస్తోంది. గీతం తొలగింపులు విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత వన్ సైడ్‌గా వ్యవహరించలేదు అనే మాట ఈ సందర్భంలో చాలామంది నుంచి వినిపించింది. . ఒక విద్యా సంస్థ పట్ల వ్యవహరిస్తున్న తీరు అనేక విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ భూములు ఆక్రమించి రిసార్ట్ లు … విల్లాలు కట్టుకున్న వారిపై చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షించే వారేమో!
అందరికీ ఇదే న్యాయం వర్తిస్తుందా?
విశాఖలో ప్రభుత్వ భూములను ఆక్రమించే వారందరికి ఇదేం న్యాయం వర్తిస్తుందా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. విశాఖ లోని ఉన్న ప్రభుత్వ భూములు ఎన్ని? వాటిలో ఆక్రమణలు ఎన్ని? ఆక్రమించింది ఎవరు? ఇలాంటి అన్ని అంశాలపైనా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుని ఉంటే.. ప్రభుత్వ పారదర్శకతకు అద్దం పట్టేది. గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ భూములకు రక్షణ లభిస్తుంది. ప్రభుత్వం నిష్పాక్షికంగా ఉన్నదనే విశ్వాసం ప్రజలకు కూడా కలుగుతుంది.











