కూటికోసమే.. కోటి విద్యలన్నారు. ఉన్నవాడికి పంచభక్ష్య పరమన్నాలు దొరుకుతున్నాయి. లేని వాడికి గంజి మెతుకులు కూడా దొరకడం లేదు. రూ.లక్షలు సంపాదించే వారు సరిగ్గా భోజనం కూడా చేయలేకపోతుంటే..కూటికి గతిలేని వారు కనీసం ఒక్క పూట భోజనం కూడా చేయడానికి డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ రెండు కారణాల వల్ల పోషకాహార లోపం ఎదుర్కొంటున్న వారు చాలా మందే ఉన్నారు. సాంకేతికతో దూసుకుపోతున్న మన దేశంలో నేటీకి ఆకలి చావులు నమోదవుతున్నాయి.
దొరికిందల్లా తినేస్తున్నారు..
ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ నేపథ్యంలో ఎంతమంది రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారంటే చెప్పడం మాత్రం కష్టమే. అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటామో చాలా మందికి తెలియదు. దొరికింది ఏదోకటి తింటే అయిపొద్ది కదా అని దొరికిందల్లా తింటారు. అది కాస్త అనారోగ్యానికి దారితీస్తుంది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కోసం ఈ విషయంలోప్రజల్లో చైతన్యం నింపేందుకు ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 16న ఆహార, వ్యవసాయం సంస్థను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇదే రోజును ప్రతి సంవత్సరం వరల్డ్ ఫుడ్ డేను నిర్వహిస్తున్నారు.
పోషకాహారం తప్పనిసరి..
ఎలాంటి ఆహారం తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటామో చేప్పె ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు. భారతీయులు రోజూ కనీసం 400 గ్రాముల కూరగాయలు, పండ్లు తీసుకోవాలని భారత పోషకాహార సంస్థ తెలుపుతోంది. తినే ఆహారంలో పండ్లు, కూరగాయాలు, పప్పుధాన్యాలతో పాటు విత్తనాలు, గింజలు, శనగలు, ఉలవలు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్ ప్రతి రోజు తీసుకోవాలి.
ఒక్క పోషకాహారం మాత్రమే తీసుకుంటే సరిపోదు. దానికి తోడూ వ్యాయామం కూడా చేయాలంటున్నారు నిపుణులు. కనీసం 30 నిమిషాలైన ప్రతి రోజు శరీరానికి వ్యాయామం తప్పనిసరిగా ఉండాలంటున్నారు. బయట దొరికే ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమని సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు తినకపోవడమే మంచిదని వైద్యులు అంటున్నారు. పుట్టిన పిల్లలకు 9 నెలల పాటు తల్లి పాలే ఇవ్వాలని సూచిస్తున్నారు. డబ్బా పాలు ఇవ్వడం వల్ల చిన్నప్పటి నుంచే వారిలో పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలుపుతున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆహార అలవాట్లు, నియమాలు నేర్పడం మంచిది అంటున్నారు వైద్యులు.











