జగన్ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కూమార్‌రెడ్డి. అప్పట్లో జగన్ చేసింది తప్పు అని నోరెత్తే సాహసం చేయని వాళ్లు.. ఇప్పుడు అదే అంశంపై కూటమి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని అంటున్నారు. నిరాహార దీక్షల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో వైసీపీ పెద్దగా కసరత్తు చేయలేదు. సింపుల్‌గా పార్లమెంటు నియోజకవర్గాలనే కొత్త జిల్లాలు అనేశారు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను అటూ.. ఇటూ మార్చారు. అప్పట్లో జగన్ ప్రభుత్వం అనాలోచిత చర్యల కారణంగా చాలా జిల్లాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కొత్తగా మరో 3 జిల్లాలను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని జిల్లాల్లో మార్పులు చేశారు. ఇదే విధంగా ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.. వైసీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి. గూడూరును నెల్లూరు జిల్లాలో చేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరిస్తున్నారు. ఈ అంశం ఆధారంగా రెండు జిల్లాల్లోనూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
మొదటి నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును.. తిరుపతి జిల్లాలో చేర్చింది అప్పటి వైసీపీ ప్రభుత్వమే. అయితే జగన్ హయాంలో ఈ అంశంపై ఒక్కసారి కూడా నోరెత్తని నల్లపరెడ్డి.. కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడమే విడ్డూరం. జగన్ చేసిన అప్పులను కూటమి ఖాతాలో వేయాలి.. జగన్ చేసిన తప్పులను కూటమి నెత్తి మీద రుద్దాలి అనే విషయంలో వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గరు అని ఈ ఉదంతంతో మరోసారి రుజువైంది











