సొంత పార్టీపై ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన తప్పుపడుతూనే ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం నుంచి మొదలు పెట్టి పేదలకు భూముల కేటాయింపు, మూడు రాజధానుల నిర్ణయాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా తనదైన శైలిలో మోడీ-జగన్ భేటీ.గురించి .లోగుట్టు చెప్పేశారు.
లోగుట్టు రాజుగారికే ఎరుక
బీజేపీ నుంచి వైసీపీకి ఎటువంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. తాము కేంద్ర మంత్రులం అయిపోయామని వైసీపీ నేతలు ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నవంబరులో కేంద్రమంత్రి వర్గ విస్తరణ వరకు వీళ్లు ఇలాగే చెప్పుకుంటారని విమర్శించారు. వైసీపీ నేతలు వీళ్లు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని వచ్చే నెలలో తేలిపోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి ఏ పార్టీ అండ అవసరం లేదని తేల్చిచెప్పిన రఘురామ ఏ పార్టీతో కలిసేది లేదని బీజేపీ స్పష్టంగా చెబుతోందని వెల్లడించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం మంత్రివర్గంపై ప్రచారం చేసుకుంటారని వ్యంగ్యాన్ని ప్రదర్శించారు.
వైసీపీని ఎన్డీయేలోకి రావాలని బతిమాలుకుంటున్నట్టు, అయితే వీరు ప్రత్యేకహోదా కోసం పట్టుబడుతున్నట్టు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కు అంత ప్రత్యేక అభిమానం ఉందా? అంటూ ప్రశ్నించారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర కేబినెట్ నుంచి బయటికి రావాలని అప్పట్లో టీడీపీని డిమాండ్ చేసింది ఎవరు అంటూ నిలదీశారు. హోదాపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తే అందుకు తాను కూడా సిద్ధమేనని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. దేవాలయాలు నిర్మించే పార్టీ అయిన బీజేపీ… ఆలయాలు కూల్చే వైసీపీతో కలుస్తుందా? అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని జగన్… ఇప్పుడు బీజేపీతో కలవాలనుకుంటున్నారా? అని నిలదీశారు.
రాజుగారిపై విమర్శలు
వైసీపీ ప్రభుత్వంపై గత కొంత కాలంగా రాజు గారు వరుసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తనకు వైసీపీ నాయకుల నుంచి ప్రమాదం పొంచి ఉందని హోంశాఖను సంప్రదించిన ఆయన రక్షణ పొందారు. కానీ మోడీ-జగన్ భేటీపై రాజు గారు చేసిన కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలో వైసీపీ చేరితే రఘురామకు వచ్చే నష్టమేంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ భేటీపై అటు బీజేపీ వర్గాలు ఇటు వైసీపీ వర్గాలు పెదవి విప్పలేదు. కానీ హడావిడిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజు గారు తన అక్కసు వెళ్ళబుచ్చారని కామెంట్స్ పడుతున్నాయి. వైసీపీపై ద్వేషం తప్పా రఘురామ విమర్శలలో పస లేదని రాజకీయ వర్గాలలో కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా రాజు గారు అనవసరమైన విషయాలపై కాకుండా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాలని హితువు పలుకుతున్నారు.